మన పరిసరాలు బాగుండాలనే ఉద్దేశ్యంతో స్వచ్చ తెలంగాణా- స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ మద్దతు పలికింది. ఆదివారం హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫిక్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ "ప్రభుత్వ బాధ్యత గానే కాకుండా సామాజిక బాధ్యతతో ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ జనాభా పెరిగిపోతుంది. ఈ జనాభా పెరుగుదల వల్ల కాలుష్యం, మౌలిక వసతుల సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఈ విషయాలపై దృష్టి పెట్టారు. అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ను 425 భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా రాజకీయ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తారు. గత ప్రభుత్వాలు చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలు కేవలం ప్రచారం కోసమే పరిమితమయ్యాయి. అలా కాకుండా ఉండాలనే ప్రతి యూనిట్ కు 50లక్షల చొప్పున 215కోట్ల రూపాయలను ఈ స్వచ్ హైదరాబాద్ కార్యక్రమానికి కేటాయిస్తున్నారు. సినిమా రంగానికి చెందినా వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉండడం సంతోషకరమైన విషయం" అని అన్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ "స్వచ్చ తెలంగాణా, స్వచ్చ హైదరాబాద్ ను స్పూర్తిగా తీసుకొని హైదరాబాద్ ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీ గా మార్చాలి" అని అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ "స్వచ్చ హైదరాబాద్ చక్కటి కార్యక్రమం. ఇందులో నేను పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. మన చుట్టూ పక్కల పరిసరాలు ఉంచుకుంటే హైదరాబాద్ ను తప్పకుండా మంచి నగరంగా తీర్చిదిద్దవచ్చు" అని చెప్పారు.
చింతర రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ "రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ను విశ్వంలోనే అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ ఇందులో భాగస్వాములుగా మారాలి" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ తివారి, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, రాఘవేంద్రరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరో రానా, బోయపాటి శ్రీను, సురేష్ బాబు, ప్రతాని రామకృష్ణ గౌడ్, టాగూర్ మధు, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీనటులుతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వచ్చ హైదరాబాద్ ప్రతిజ్ఞ చేయించారు.