తెలుగు ప్రజలకు '108' ఓ సంజీవనిలా మారింది. ఎక్కడ ప్రమాదం జరిగినా తానునంటూ సైరన్ మోగిస్తూ వచ్చే ఈ వాహనం ఇప్పటికి వేలాది మంది ప్రాణాలను కాపాడింది. అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన సెగ ఈ సేవలను కూడా తాకింది. ప్రస్తుతం జీవీకే సంస్థ నిర్వహిస్తున్న '108' సేవలను తెలంగాణ ప్రభుత్వం మరో సంస్థకు అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 108 సేవలను జీవీకే సంస్థకు అప్పగించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పనిచేస్తున్న '108' ఉద్యోగులపై యాజమాన్యం వివక్ష చూపుతోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీంతో '108' నిర్వహణను జీవీకే సంస్థనుంచి తప్పించి యశోద ఆస్పత్రి యాజమాన్యానికి అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం. యశోద ఆస్పత్రి వైద్య సేవల్లో ఉండటంతోపాటు ఈ సంస్థ యాజమాన్యం సీఎం కేసీఆర్‌కు సన్నిహితులు కావడంతో ఈ సంస్థకే '108' సేవలు అప్పగించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు '108' సేవలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు సమ్మె బాటపట్టారు. మరి యశోద ఆస్పత్రికి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే ఉద్యోగులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.