ప్రణబ్ ముఖర్జీ తర్వాత ఎవరు రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహిస్తారనే విషయమై ఇప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. దీనికోసం బీజేపీ అధిష్టానం ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నట్లు ఓ ఇంగ్లిష్‌పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం ప్రణబ్‌ముఖర్జీ తర్వాత స్పీకర్ సుమిత్ర మహజన్ రాష్ట్రపతిగా, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయంటూ ఆ పత్రిక ప్రచురించిన కథనం రాజకీయవర్గాల్తో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.
సాధారణంగా పార్టీలకు ఎనలేని సేవలందించిన వ్యక్తులకు సదరు పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి పదవిని ఇస్తాయి. అయితే బీజేపీలో ఎల్‌కే అద్వాని, మురళీమనోహర్‌జోషి వంటి సీనియర్ నాయకులున్నారు. తదుపరి రాష్ట్రపతిగా ఎల్‌కే అద్వానిని ఎన్నుకుంటారని, అందుకే ఆయన మోడీ ప్రభుత్వంలో ఎలాంటి మంత్రి పదవిని కూడా తీసుకోలేదనే చర్చలు కొన్ని రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో సుమిత్ర మహజన్, వెంకయ్యనాయుడుల పేర్లు తెరమీదకు రావడం కాషయదళాన్ని అయోమయానికి గురిచేస్తోంది. బీజేపీ అధిష్టానం ఎల్‌కే అద్వాని వైపు కాకుండా సుమిత్ర మహజన్ వైపు ఎందుకు మొగ్గుచూపుతుందో ఆ పార్టీ శ్రేణులకు అర్థంకావడం లేదు. అద్వానీకి రాష్ట్రపతి పదవి రాకుండా మోడీ ఏమైనా మంత్రాంగం నడుపుతున్నారేమోనన్న అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు.