మండు వేసవి అందునా ఇంటర్ విద్యార్ధులకు ఎంసెట్ పరీక్ష, తోడుగా డిఎస్సీ పరీక్ష పైగా పెళ్ళిల్ల సీజన్. ఈ సమయంలో ఆర్.టి.సి. సిబ్బంది సమ్మె ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఉభయ రాష్ట్రాల సర్వోన్నత న్యాయస్ధానం సయితం కలుగజేసుకోవలసిన దుర్భర పరిస్ధితి. ఉద్యోగులు కోరిన 43 శాతం ఫిట్‌మెంట్‌కి ఆంధ్రా సర్కారు అంగీకరించింది. తెలంగాణ సర్కారు మరో అడుగు ముందుకేసి 44 శాతం అన్నది. బకాయిల చెల్లింపుకి ఎవరి వెసులుబాటుని బట్టి వారు ప్రకటనలు చేశారు. ఇంతకీ ఆర్టీసీ ఉద్యోగులు కోరినదేమిటి? ప్రభుత్వాలు ఇచ్చిందేమిటి? సమ్మెలు, ప్రతిష్టంభన ఎందుకు చోటుచేసుకున్నాయి? ఆర్.టి.సి. నష్టానికి ప్రజల కష్టాలకి బాధ్యులెవరు? ఆర్.టి.సి. ఉద్యోగుల కోరికలను నిర్ద్వందంగా అంగీకరించిన ఇద్దరు ముఖ్యమంత్రులను అభినందించడం కాదు అభిశంసించాలి, వారి కాలయాపనకి.