ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. దాదాపు అనుకున్న లక్ష్యంలో పెద్ద మొత్తంలో భూమిని ప్రభుత్వానికి బదిలీ చేస్తూ ఒప్పందాలు జరిగిపోవడంతో ఇక కొత్త రాజధాని నిర్మాణంపై సర్కారు దృష్టి సారించింది. జూన్ మొదటివారంలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు సర్కారు ఎన్నో రోజులుగా చెబుతోంది. దీనికి ప్రధాని మోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇక జూన్ మొదటి వారంలో 5,6,8వ తేదీల్లో భూమిపూజకు మంచి ముహుర్తాలు ఉన్నట్లు పురోహితులు ఏపీ సర్కారుకు సూచించినట్లు సమాచారం. ఈ మూడు తేదీల్లో దేనివైపు చంద్రబాబు మొగ్గుచూపుతారనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది.
మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మూడు తేదీలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. మంత్రివర్గంలోని మెజార్టీ మంత్రులు కూడా 6వ తేదీవైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అయితే ఈ తేదీ ఖరారుపై చంద్రబాబు మాత్రం నోరువిప్పనట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోడీ వీలునుబట్టి ఈ మూడు తేదీల్లో ఓదానికి చంద్రబాబు ఓటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధ్యమనంత త్వరగా హైదరాబాద్‌నుంచి ప్రభుత్వ కార్యాలయాలను నూతన రాజధాని అమరావతికి తరలించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.