అతిసామాన్యుడిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ పీఠంపై ఆ రాష్ట్ర ప్రజలు కూర్చోబెట్టిన అందుకు దోహదం చేసింది మాత్రం నేషనల్ మీడియానే. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ నేషనల్ మీడియాకు మాత్రం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ పార్టీ మినహాయించి మిగితా సమస్యలు కనిపించట్లేదన్న స్థాయిలో ఆయనకు ప్రచారం చేసి పెట్టింది. దీంతో ఢిల్లీ పీఠాన్ని రెండోసారి కూడా అరవింద్ కేజ్రీవాల్ హస్తగతం చేసుకున్నాడు. ఇక ఎన్నికల తంతు ముగియగానే మీడియాకు ఆప్ పార్టీలోని లోసుగులపై దృష్టిపడింది. ఆ పార్టీ గురించి వరుస కథనాలు మీడియాలో వస్తుండటంతో అగ్గిమీద గుగ్గిలమైన కేజ్రీవాల్ ఏకంగా మీడియాపైనే ఆంక్షలు విధించాడు.
ఇంతటితో ఆగకుండా మీడియాపై పరువు నష్టం దావా కేసులు వేయడానికి నడుం బిగించాడు. మీడియా తన పార్టీని పూర్తిగా మట్టుబెట్టడానికి సుపారీ తీసుకుందంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. దీనికితోడు మీడియాపై కేసులు పెట్టాలంటూ ఢిల్లీ అధికారులను కూడా ఆదేశించాడు. ఈ విషయమై అందిన ఓ పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. కేజ్రీవాల్ ఆదేశాలపై స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. ఇది ఆప్ సర్కారుకు మింగుడుపడని విషయమే. ఇక కేజ్రీవాల్ వ్యవహారం ఏరు దాటేదాక ఓడ మల్లన్న, ఏరు దాటగానే బోడి మల్లన్న అన్న రీతిలో ఉందని ఢిల్లీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.