ఏపీ, తెలంగాణల మధ్య విభజన విబేధాలు తీవ్రతరమవుతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సయోధ్యకు ఆసక్తి చూపకపోవడంతో తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. ఇక ఉమ్మడి రాజధానిలో తెలంగాణ ప్రభుత్వం హవా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలను టీ-ఉద్యోగులు స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఏపీ ఉద్యోగులు ఉందిపోయారు.
ఉన్నత విద్యా మండలికి సంబంధించి హైకోర్టు తెలంగాణకు అనుకూలంగా స్పష్టమైన తీర్పునిచ్చింది. ఇదే అదనుగా ఏకంగా అక్కడ ఏపీ కార్యాలయాన్ని, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గదిని కూడా తెలంగాణ ఉద్యోగులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర విమర్శలు రేకెత్తాయి. అయినా వెనక్కి తగ్గని టీ-సర్కారు ఉన్నత విద్యా మండలితో ఏమాత్రం సంబంధం లేని సాంకేతిక విద్యా మండలి భవనాలను కూడా స్వాధీనం చేసుకుంది. టీ-ఉద్యోగులు ఏపీ సాంకేతిక విద్యా మండలి కార్యాలయాలకు తాళం వేశారు. దీనిపై ఏపీ ఉద్యోగులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అని చెప్పి కేంద్రం కేటాయించిన భవనాలను తెలంగాణ సర్కారు ఎలా స్వాధీనం చేసుకుంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా అడుగడుగునా విభజన చట్టానికి తూట్లు పొడిస్తే మరోసారి ఉద్యమిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.