ఆర్టీసీ కార్మికుల సమ్మె తుది దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. అటు ఏపీ, ఇటు తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాలను చూస్తే మరో 24 గంటల్లో సమ్మెకు పులిస్టాప్ పడే అవకాశాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంలో జోక్యం చేసుకున్న హైకోర్టు కార్మిక సంఘాలను తీవ్ర పదజాలంతో హెచ్చరించింది. వెంటనే సమ్మెను విరమించకపోతే ఎస్మా చట్టాన్ని వినియోగించడానికి కూడా ప్రభుత్వాలకు అనుమతినిచ్చింది. దీంతో ఎంతోకొంత కార్మిక సంఘాలు వెనక్కి తగ్గని పరిస్థితి నెలకొంది. మరోవైపు 43శాతం ఫిట్‌మెంట్ ఇవ్వలేమని ఏపీ సర్కారు తేల్చిచెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడంతో ప్రభుత్వంపై మోయలేని భారం పడిందని, ఇక ఆర్టీసీ ఉద్యోగులకు ఆ మేర ఫిట్‌మెంట్ ఇవ్వడం అసాధ్యమని ఆర్టీసీ ప్రకటించింది. దీంతో తెలంగాణ సర్కారు ఎంత ఫిట్‌మెంట్ ఇస్తే అంతే ఏపీ ప్రభుత్వం కూడా ఇవ్వాలని కార్మిక సంఘాలు షరతు విధించాయి. దీంతో తెలుగు ప్రజల దృష్టి మొత్తం తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పడింది.
8 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. 43శాతం ఫిట్‌మెంట్‌నుంచి కార్మికులు ఏమాత్రమైన కిందకు దిగుతారేమోనని తెలంగాణ సర్కారు చర్చల ద్వారా ప్రయత్నించింది. ఇక కార్మికులు ఏమాత్రం వెనక్కితగ్గే అవకాశాలు కనిపించకపోవడంతో 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి కేసీఆర్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఇందుకోసం మరికొద్ది సమయంలో కార్మిక సంఘాల నేతలతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇక మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడంలో పెద్దగా సమస్య ఎదురయ్యే అవకాశాలు లేవు. మరి ఏపీలో చంద్రబాబు 43శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి ఎలాంటి జిమ్మిక్కులు చేస్తారో వేచిచూడాల్సిందే.