గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తన చూసిన ఎవరికైనా ఈ మాట చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ గానీ, ప్రేక్షకులు గానీ, సామాన్య ప్రజలు గానీ హీరోగా చూడటం లేదు. అతనిలో ఏదో ఎక్స్ ట్రా క్వాలిటీ ఉందని భావిస్తున్నారు, అందుకే అంతలా ఆరాధిస్తున్నారు, అభిమానులైతే పవన్ ని దేవుడిలా భావిస్తున్నారు. వారు భావిస్తున్నట్లు గానే పవన్ గుడిలో దేవుడిలానే ఉండిపోతున్నాడు తప్ప, బయటి ప్రజల బాధలు మాత్రం పట్టించుకోవడం లేదు. నేను ఉన్నానని తెలియడానికి మాత్రం నెలకో ట్విట్, తన ద్వారా సహాయం పొందిన వారిని ఎవరినో ఒకర్ని జనసేన ఆఫీస్ లో కలుసుకోవడం, ఇదేనా నాయకుడి పనితనం. ఇందుకేనా జనసేన పార్టీ. అన్యాయం జరిగిన ప్రతిచోట జనసేన పోరాడుతుంది అని పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన స్పీచ్ లో చెప్పినట్లు గుర్తు. ఈ మధ్య మీరు నటించిన 'గోపాల గోపాల' లో కూడా దగ్గరుండి మరీ రాయించుకున్న డైలాగ్స్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. "సమర్ధులు ఇంట్లో కూర్చుంటే అసమర్ధులు రాజ్యాలేలుతారు, నాయకుడు అంటే గెలిచేవాడు కాదు.. గెలిపించేవాడు". మీరు ఎప్పటికి గెలిపించేవారుగానే ఉండండి. పరవాలేదు. కానీ మీరు గెలిపించిన నాయకులు ప్రజల్ని పాలిస్తున్నారో.. పిండుకుంటున్నారో తెలుసుకోవాల్సిన కర్తవ్యం మీకు ఉందని తెలుసుకోండి.
ఇక సినిమాల గురించి చూస్తే ఇదిగో-అదిగో అంటూ డైరెక్టర్స్ ని మార్చడం తప్ప.. మీ సినిమా సెట్టుకు ఎప్పుడు వెళుతుందో చెప్పడానికి మీ నిర్మాతలు కూడా భయపడుతున్నారు. పైగా మీరే వెళ్ళి నాతో సినిమా చేయండి అని అడిగినట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ మాట మీ ఫ్యాన్స్ ని ఎంతగా భాదిస్తుందో ఒక్కసారి ఆలోచిచండి! పైగా రాజమౌళిని ఉద్దేశించి ఓ వేదిక పై మీరే చెప్పినట్లు గుర్తు. నాకు అలా అడుక్కోవడం ఇష్టం లేదు అని. "నాయకుడు, నటుడు అనేవాడు మాట్లాడకుండా ఉంటే నరం లేని నాలుకలు రాజ్యమేలుతాయని చెప్పేది అందుకే".
ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేసి.. అక్కడ మాత్రమే మాట్లాడుతాను అంటే కుదరదు. ప్రజలు అక్కడ ఉండరు. మీరు ఈసారి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టిన ప్రజలు నమ్మరు. నాయకుడు అనేవాడు ముందు ప్రజల గుండెల్లో ఉండాలి. ఆస్థానం జారి ఫుట్ బాల్ లా మారకుండా ఉండాలంటే ముందు మీ పద్ధతి మార్చుకోండి. మీపై మీరు ఓ క్లారిటీకి రండి. మీ జనసేన గదులలో నుండి, మీరు పెంచుతున్న ఆ గడ్డంలో నుండి బయటికి వచ్చి చూడండి! సమస్య మీరు తీర్చకపోయినా పరవాలేదు. ఆ సమస్యతో బాధపడుతున్న వారికి ఆసరా ఇవ్వండి చాలు. మీ స్థానం ఎప్పుడూ అక్కడే ఉంటుంది.
-జైహింద్-