బడ్జెట్‌కు ముందు కేంద్రం నుంచి ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున సాయాన్ని అందించారు. సాయం విషయాన్ని పక్కకు పెడితే ప్రత్యేక హామీపై కూడా ఊరించి ఊరించి ఉసురుమనిపించింది మోడీ సర్కారు. ఇప్పుడు మళ్లీ ఉమాభారతి తెలుగు ప్రజలకు కొత్త ఆశలు పెడుతున్నారు. కేవలం వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.
దాదాపు రూ. 16 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంది. అయితే ఈ బడ్జెట్‌లో పోలవరానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. కాని కేంద్రం మాత్రం కేవలం రూ. 250 కోట్లు మాత్రమే ప్రకటించింది. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చని పోలవరం రైతులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. అయితే ఉమాభారతి లోక్‌సభలో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరాన్ని ఐదేళ్లలో పూర్తిచేస్తామని చెప్పారు. అంతేకాకుండా పోలవరం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కూడా చెప్పారు. అయితే ఏడాది కాలంగా పోలవరం పనుల్లో పెద్దగా పురోగతి లేదు. మరి పోలవరంపై పూర్తి అవగాహనతోనే ఉమాభారతి ఈ ప్రకటన చేశారా..? లేక ఎంపీ ప్రశ్నకు సమాధానంగా.. నోటికి వచ్చింది మాట్లాడి తప్పించుకున్నారా..? అనే అనుమానాలు నెలకొన్నాయి.