ప్రత్యేకవాదం గాలివాటంతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఇప్పుడు సంస్థాగతంగా పార్టీని బలపర్చుకునే అంశంపై దృష్టిసారించింది. దీనికోసం నాయకగణాన్ని తయారుచేసుకునే సమయం లేకపోవడంతో ఇతర పార్టీల్లోని నాయకులను వలస రప్పించుకుంటోంది. నయానో.. భయానో టీడీపీ నుంచి ఈ వలసలు ఒకరేంజ్‌లో సాగాయి. ఇక గ్రామీణ స్థాయిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కారు ఎక్కి గులాబి కండువాలు కప్పుకుంది. ఇక టీడీపీని ఖాళీ చేయడంతో టీఆర్‌ఎస్ దృష్టి ఇప్పుడు కాంగ్రెస్‌పై పడింది.
ఆరు దశాబ్దాలుగా తెలంగాణలో కాంగ్రెస్ బలమైన పార్టీగా కొనసాగుతోంది. ఇక ఎన్నో వ్యయప్రాయాసాలు కోర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడంతో ప్రజల్లో కూడా ఆ పార్టీపై సానుభూతి ఉంది. ఈ తరుణంలో ఆ పార్టీనుంచి నాయకులు అంత సులభంగా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం లేదు. అందుకోసం టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం ఓ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదివరకు కొనసాగిన ఇందిరమ్మ గృహ పథకంలో అనేక అవకతవకలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దళారులుగా వ్యవహరించి లబ్ధిదారులనుంచి సగానికి సగం నొక్కారనే విమర్శలున్నాయి. ఈ అవకతవకలపై టీఆర్‌ఎస్ సర్కారు సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందిరమ్మ గృహాల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు అనేక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది బూచిగా చూపి నయానో భయానో వారిని టీఆర్‌ఎస్‌లో కలిపేసుకోవాలని గులాబిదళం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలో చేరకపోతే కేసులు నమోదుచేస్తామని హెచ్చరిస్తే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా కారు ఎక్కుతుందన్న ఆలోచనలో టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం ఉన్నట్లు సమాచారం. ఇందిరమ్మ గృహాలపై విచారణ పేరుతో కొత్త గృహాలను మంజూరుచేయకపోడంతో అటు ప్రభుత్వానికి ఆదాయం మిగులుతుండగా... మరోవైపు కాంగ్రెస్ క్యాడర్ కూడా టీఆర్‌ఎస్‌లో వచ్చే అవకాశం ఉండటం గులాబిదళానికి బాగా కలిసొచ్చే విషయమే.