రాజధాని భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం వెనక్కితగ్గే సూచనలు కనిపించడం లేదు. ఎన్ని అవంతరాలు ఎదురైనా అనుకున్న లక్ష్యంమేర భూములు సేకరించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే రైతులనుంచి దాదాపు 33 వేల ఎకరాల భూమిని సేకరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. 10 వేల ఎకరాలకు సంబంధించి ఇప్పటికే రైతులతో ప్రభుత్వం అవగాహన కూడా కుదుర్చుకుంది. అయితే కొన్ని గ్రామాల్లో కొందరు మాత్రమే భూసేకరణను వ్యతిరేకిస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గ్రామస్తులంతా ఏకమై భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామాల్లో భూములు ఎలా సేకరించాలన్నది ప్రభుత్వానికి సవాలుగా మారింది.
సోమవారం సమావేశమైన ఏపీ క్యాబినెట్ రాజధాని భూసేకరణ విషయంపై చర్చించింది. ప్రధానంగా ఉండవల్లి, రాయపూడి, నిడమర్రు గ్రామాల్లోని రైతులు భూసేకరణను పూర్తిగా వ్యతిరేకించడంపై మంత్రివర్గంలో చర్చ జరిగినట్లు సమాచారం. మే 15 వరకు వీరికి గడువునిచ్చి ఆ తర్వాత భూసేకరణ చట్టాన్ని వీరిపై ప్రయోగించాలని ఏపీ సర్కారు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే భూసేకరణ చట్టాన్ని వినియోగిస్తే రైతులను బెదిరించినట్లవుతుందని, అప్పుడు అన్ని వర్గాల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కొందరు మంత్రులు మాట్లాడినట్లు తెలిసింది. దీనికితోడు పవన్‌కల్యాణ్ కూడా భూసేకరణ చట్టాన్ని వినియోగించడానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ పక్షంలో మరి ప్రభుత్వం ఎలా ముందుకు పోతుందనేది ఆసక్తికరంగా మారింది.