ఇక కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో రాష్ట్రాలను కూడా చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. ఇందులోభాగంగానే పశ్చిమబెంగాల్‌లో ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను చిక్కులో పడేయడానికి చూసింది. ఇక త్వరలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రగాఢంగా విశ్వసించారు. అయితే ఓటర్లు మాత్రం బీజేపీకి చుక్కలు చూపించారు. ఇటీవలే ముగిసిన మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానం కూడా దక్కించుకోకపోవడం ఆ పార్టీని తీవ్రంగా నిరాశపరిచింది. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 90 మున్సిపాలిటీల్లో 71 స్థానాల్లో విజయదుందుబి మోగించింది. అంతేకాకుండా సీపీఎం 5 స్థానాల్లో, కాంగ్రెస్ 4 మున్సిపాలిటీల్లోనూ విజయం సాధించడం గమనార్హం.
కొన్ని రోజుల కిందట పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన అమిత్‌షా ఆ రాష్ట్రంలో తృణమూల్‌ను పెకటి వెళ్లతోసహా పీకి పారేస్తామని ప్రగల్భాలు పలికారు. అంతేకాకుండా శారదా స్కాంలో తృణమూల్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను సీబీఐ అరెస్టు చేయడంతో మమతపై ప్రజలకు వ్యతిరేకత వచ్చిందని అందరూ భావించారు. అయితే సీబీఐ అరెస్టులతో మమతపై ప్రజలకు వ్యతిరేక భావం కాకుండా సానుభూతి పవనాలు వీచినట్లు కనిపిస్తోంది. కొల్‌కొతా మున్సిపాలిటీలోని 144 డివిజన్లకుగాను తృణమూల్ 114 సీట్లు దక్కించుకోవడం గమనార్హం. నిజానికి పట్టణ ప్రాంతాల్లో మోడీకి అనుకూలత ఉంటుంది. కాని ఇక్కడ మోడీ హవా ఏమాత్రం పనిచేయకపోవడం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. ఏడాది పాలనా కాలంలో ప్రజల్లో మోడీపై విశ్వాసం సన్నగిల్లిందని చెప్పడానికి ఈ మున్సిపాలిటీ ఎన్నికలే నిదర్శన. ఇప్పటికైనా మోడీ ప్రచార పాలనకు స్వస్తి పలికి జనరంజక పాలన దిశగా అడుగులు వేస్తే బాగుంటుందనేది విమర్శకుల సూచన.