సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నా వైసీపీలో మాత్రం ఆశ చావడం లేదు. తెలంగాణలో ఎలాగైన కొన్ని సీట్లు అయినా గెలవాలన్న జగన్ పంతం సీమాంధ్రలో కూడా ఆ పార్టీని అధికారానికి దూరం చేసింది. అంతేకాకుండా ఎన్నికల తర్వాత కూడా జగన్ తెలంగాణను వదిలిపెట్టలేదు. తెలంగాణలో ఎలాగైనా పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో జగన్ తన సోదరి షర్మిలతో కూడా వరుసపెట్టి యాత్రలు చేపించినా.. ఏమాత్రం గిట్టుబాటు కాలేదు. ఇక లాభం లేదనుకొని తెలంగాణకు ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షుడిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. ఇక ఇప్పుడు ఆయన పార్టీ బాధ్యతలను భూజానికెత్తుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సమావేశానికి వచ్చిన జనాలు వందలు కూడా దాటకపోయినా పొంగులేటి మాటలు మాత్రం కోటలు దాటాయి. వచ్చే గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని స్థానాలనుంచి పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఖమ్మంలో వచ్చిన ఫలితాలను హైదరాబాద్‌లో కూడా రిపీట్ చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో ఆ పార్టీకి క్యాడరే లేదు. పార్టీకి నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జిలను మినహాయిస్తే మిగిలిన క్యాడర్ పార్టీలో ఉందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలోనూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామంటూ శ్రీనివాసరెడ్డి ప్రకటించడం సాహసమనే చెప్పాలి. మరి పొంగులేటి చెప్పిన విధంగా వైసీపీ ప్రభజనం సృష్టిస్తుందా..? లేక పత్తా తేకుండా పోతుందా..? అనేది ఎన్నికలు వస్తే కాని చెప్పలేం.