ఒకప్పుడు ప్రధానమంత్రి అభ్యర్ధిని నిర్ణయించిన కింగ్ మేకర్, హైదరాబాదులో ఏ చిన్న కార్యక్రమం తలపెట్టినా స్టార్‌గ్లామర్ తోడువున్న లెజండ్రీ ఫిగర్ చంద్రబాబు నాయుడు. రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ప్రబోధించిన ఈ విజనరీ లెజండ్‌ని తెలంగాణలో వలసపోతున్న తెలుగు తమ్ముళ్ళు, లోటు బడ్జెట్ రాష్ట్రానికి జనాభా ప్రాతిపదికగా అధికశాతం అప్పులు, వినియోగం ప్రాతిపదికగా విద్యుత్తు పంపిణీ వలన మరోమారు లాభపడిన హైదరాబాదు, తెలంగాణతో పోటీగా ప్రభుత్వోద్యోగులకు ఫిట్‌మెంట్, విడివిడిగా ఇంటర్ పరీక్షలు, ఎంసెట్, తాజాగా ఆంధ్రా వాహనాలపై ఎంట్రీటాక్సు విధించిన తెలంగాణ ప్రభుత్వం, నిరసనకు దిగిన ప్రైవేటు వాహన యజమాన సంఘాలు. సవాలక్ష సవాళ్ళు విసురుతున్నారు. తెలంగాణవలె తెలంగాణ నుంచి వస్తున్న ప్రైవేటు వాహనాలపై టాక్సు విధిస్తే వాహన యాజమాన సంఘాల నిరసన సెగవద్ద చలికాచుకోవాలి. లేదంటే ఆంధ్రా వాహన యజమానులు తమ వాహనాల రిజిస్ట్రేషన్లు హైదరాబాదులో జరిపిస్తారు. దీనివలన ప్రభుత్వ ఆదాయం పడిపోతుంది. తప్పనిసరిగా ఎంట్రీటాక్సు విధించాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబుకి. సరిగ్గా ఇదే సమయంలో భూ సేకరణని నిరసిస్తూ ఢల్లీిలో రైతు నాయకుని ఆత్మహత్య నవ్యాంధ్ర రాజధాని భూసేకరణకు పెద్ద దెబ్బ. పులిమీద పుట్రలా నిండు సభలో ‘ప్రత్యేక హోదా’ హామీ ఇచ్చిన నాటి ప్రధాని మాటని నేడు తీసిగట్టున పడేసి ప్రత్యేకహోదా లేదు పొమ్మంటున్నారు. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగు తమ్ముళ్ళు బయటకు రావాలని విపక్షాలు గొడవ చేయడం ఖాయం. ప్రజా మద్దతు మాత్రమే చంద్రబాబుని కాపాడగలదు.. చంద్రబాబే ఏదైనా చేస్తే అన్న నమ్మకం వుంది ప్రజలలో. చంద్రబాబు చాకచక్యానికి శల్య పరీక్ష వచ్చిపడింది.