మోత్కుపల్లి నరసింహులు టీడీపీలో ప్రధాన నేతగా కంటే కూడా అసంతృప్తివాదిగా పేరుగడించారు. దాదాపు ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైనా మోత్కుపల్లికి టీడీపీలో సరైన గుర్తింపు దక్కలేదన్నది వాస్తవం. ఇక టీడీపీకి అండగా నిలబడి టీఆర్‌ఎస్ అధినేతను తీవ్రంగా విమర్శించిన వారిలో మోత్కుపల్లి ముందు వరుసలో ఉంటారు. దళిత వర్గానికి చెందిన మోత్కుపల్లిని విమర్శించడానికి కేసీఆర్ కూడా కాస్త ఆలోచించి ముందుకు వెళ్లేవారు. అయితే తాను పార్టీకి ఇంతగా చేస్తున్న చంద్రబాబు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని మోత్కుపల్లి పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తి వెళ్లగక్కారు. రాజ్యసభ సీటు ఆశించి భంగపడినప్పుడు, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు దక్కనప్పుడు మోత్కుపల్లి టీడీపీకి రాజీనామా చేసే వరకు వెళ్లారు. అయితే చివరి క్షణాల్లో చంద్రబాబు బుజ్జగింపులతో ఆయన వెనకడుగు వేసేవారు.
ఇన్నాళ్లకు మోత్కుపల్లికి టీడీపీలో సరైన గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే పలు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించనుంది. ఇక భాగస్వామిపక్షంగా టీడీపీకి కూడా ఓ గవర్నర్ స్థానం లభిస్తుందన్న వార్తలు వినబడుతున్నాయి. ఈ మేరక ఇప్పటికే చంద్రబాబు కేంద్రంతో మాట్లాడినట్లు సమాచారం. ఇక ఈ గవర్నర్ పదవి మోత్కుపల్లికే లభించనుందని టీడీపీ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యక్తికి గవర్నర్ పదవి అప్పగిస్తే అటు ప్రజలను కూడా ఆకట్టుకోవచ్చన్న భావనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.