తెలంగాణ సచివాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రికి సచివాలయాన్ని తరలిస్తారనే వాదనలు వినిపించాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం దీనిపై వెనక్కితగ్గినట్లు సమాచారం. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి కేంద్ర ఏవియేషన్‌శాఖ అడ్డుచెప్పే అవకాశాలు కనబడటంతో టీ-సర్కారు ఇప్పుడు వెనక్కితగ్గింది. ఛాతి ఆస్పత్రికి సమీపంలోనే బేగంపేట్ ఎయిర్‌పోర్టు ఉండటం, ఇప్పటికీ ఇక్కడ విమానాలు ల్యాండ్ అవుతుండటంతో సచివాలయం నిర్మాణానికి ఏవియేషన్‌శాఖ అడ్డుచెప్పే అవకాశాలున్నాయి.
దీనికి ప్రత్యామ్నాయంగా సికింద్రబాద్‌లో సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్‌లోని జింఖానా లేదా.. బైసన్ మైదానాల్లో సచివాలయం నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మైదానాలపక్కనే విశాలమైన రోడ్డు ఉండటం, మైదానాలు కూడా దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉండటంతో ఇక్కడ సచివాలయం నిర్మాణానికి అన్ని అనుకూలంగా ఉంటాయని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఈ రెండు మైదానాలు కూడా డిఫెన్స్ పరిధిలో ఉన్నాయి. దీంతో డిఫెన్స్‌కు నగర శివారులో ప్రత్యామ్నాయ భూమిని చూపించి ఈ రెండు మైదానాల్లో ఓ దాన్ని కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని టీ-సర్కారు భావిస్తోంది. ఇందుకోసం త్వరలో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి డిఫెన్స్ మంత్రిని కలిసే యోచనలో ఉన్నారు.