ప్రత్యేక హోదాపై ఇటు కేంద్రం అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని రోజులు స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే వస్తుందంటూ రాష్ట్ర సర్కారు.. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కొన్ని చిక్కులు ఉన్నాయంటూ కేంద్ర సర్కారు విషయాన్ని నాన్చుతూ వచ్చాయి. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా దక్కుతుందో లేదో తెలియక రాష్ట్ర ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఎట్టకేలకు ఈ విషయానికి కేంద్రం స్పష్టతనిచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రణాళిక మంత్రి ఇంద్రజిత్ పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదని, భవిష్యత్తులో కూడా ఇచ్చే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఎంపీలు మాగంటి బాబు, ప్రభాకర్‌రెడ్డిలు వేసిన ప్రశ్నకు సమాధానం చెబుతూ 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు వ్యవహరిస్తున్నామని, ఇప్పుడున్న 11 రాష్ట్రాలకు మాత్రం ప్రత్యేక హోదా భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని చెప్పారు.
ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి చేసిన ప్రకటన అటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీకి రుచించని విషయమే. ఇక ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరి రాష్ట్రానికి టీడీపీ ప్రత్యేకంగా సాధించిదేమీ లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజీనామా చేయాలని, కేంద్రం నుంచి టీడీపీ తప్పుకోవాలని డిమాండ్లు వినబడుతున్నాయి. ఈ సమయంలో వెంకయ్యనాయుడు జోక్యం చేసుకొని ఈ ప్రకటన నుంచి కేంద్రం కాస్త వెనక్కితగ్గేలా ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.