ఓవైపు ప్రధాని మోదీ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ దేశాలలో పర్యటిస్తున్నారు, పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. వేలకోట్ల వ్యాపారంతో ముడిపడివున్న సృజనాత్మక కళ ‘సినిమా’. సంస్కృతి వారధిగా కూడా చెప్పుకోవచ్చు ఈ సినిమాని. భారత్, పాక్, బంగ్లా, నేపాల్, టిబెట్‌లను దగ్గర చేయగల సమ్మోహనాస్త్రం ఈ సినిమా. రష్యా, జపాన్, సింగపూర్, మలేసియా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోకూడా భారతీయ సినిమాకి మంచి మార్కెట్ వుంది. భారత ప్రధానితోగాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితోగాని సినీ పారిశ్రామిక అభివృద్ధి బృందం పర్యటించడంలేదు. సినిమా రంగంలో ఇరుదేశాల సంయుక్త నిర్మాణం, ఇరుదేశాలలో సినిమా ప్రదర్శనలు, టెక్నాలజీని ఇచ్చిపుచ్చుకోవడం దిశగా ఎటువంటి ప్రయత్నమూ జరగడంలేదు. అంతకుమించి నవ్యాంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి ఆలోచనే లేకుండా పోయింది. ఇదే సందర్భంగా తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా వున్నా ఆయన ఇచ్చిన వరాలను అందిపుచ్చుకునే ప్రయత్నం జరగడంలేదు. ప్రపంచ మార్కెట్‌ని సాధించే అవకాశాలు పుష్కలంగా వున్నా రొచ్చు రాజకీయాలతో సినీ వర్గాలు కాలాన్ని, అవకాశాలను వృధా చేస్తున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో నాయకత్వం కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ భర్తీని పూడ్చేదెవరో చూడాలి.
- తోటకూర రఘు