బీసీ సంఘం నేతగా ఆర్.కృష్ణయ్య రాష్ట్రంలో తిరుగులేని వ్యక్తిగా చెలామణి అయ్యారు. అయితే గత ఎన్నికలు ఆయన పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. అంతకుముందు రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల నాయకులు ఆయన్ను ఆదరించేవారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయన సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో ఆయన తెలుగు దేశం పార్టీకే పరిమితమైంది. ఆ తర్వాత పార్టీలో కూడా ఆయనకు సముచిత స్థానం ఇవ్వకపోవడంతో టీడీపీతో కృష్ణయ్య అంటీముట్టన్నట్లే వ్యవహరిస్తున్నారు. ఏక్షణంలోనైనా ఆయన టీడీపీని వదిలి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లవచ్చన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన కూడా టీడీపీతో తనకు సంబంధం లేదన్నట్లే వ్యవహరించేవారు. పార్టీ అధికారిక కార్యక్రమాలకు వెళ్లడం, టీడీపీ నాయకుల మీటింగ్‌ల్లో పాల్గొనడం కృష్ణయ్య ఎప్పుడో మానేశారు. ఇక అసెంబ్లీలో కూడా ఆయన ప్రత్యేకంగా వ్యవహరించేవారు. గత సెషన్‌లో టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలంతా సస్పెండ్ అయినా కృష్ణయ్య మాత్రం రోజూ అసెంబ్లీకి వచ్చేవారు. దీంతో ఆయన టీడీపీలో ఉన్నారా..? లేక వేరే పార్టీలో చేరుతున్నారా..? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారా..? అనేవి ఎవరికీ అర్థంకాకుండా ఉన్నాయి.
ఇక ఈ సందిగ్ధానికి తెరదించుతూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎల్‌బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సామ రంగారెడ్డిని నియమించింది. ఎల్‌బీనగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేను కాకుండా వేరే వ్యక్తిని పార్టీ ఇన్‌చార్జిగా నియమించడం కృష్ణయ్య పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. దీన్నిబట్టి కృష్ణయ్య ఇక టీడీపీలో లేన్నట్లే. వేరే వ్యక్తి ద్వారా ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో పార్టీని బలపర్చాలనే ఉద్దేశంతోనే ఈ నియామకం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ తరుణంలో కృష్ణయ్య టీడీపీలోనే కొనసాగుతారా..? లేక వేరే మార్గాన్ని అన్వేషిస్తారా అనేది తేలాల్సి ఉంది.