విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. దీనికోసం రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పట్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరగదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆర్టికల్ 170 ప్రకారం 2029 వరకు కూడా రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యనే కొనసాగుతుందని, 2029లో తిరిగి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని తెలిపారు. అయితే రాష్ట్ర విభజన చట్టంలో ఎమ్మెల్యేల సంఖ్య పెంచుతామని చెప్పారుగా అంటూ టీఆర్‌ఎస్ ఎంపీ మధు అడిగిన ప్రశ్నకు 2029 వరకు కూడా ఇది సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే శాసనసభకు వెళ్లే అవకాశం తమకూ దొరుకుతుందని భావించి నాయకులు నిరాశకు గురవుతున్నారు. ఈ లెక్కన 2019, 2024 ఎన్నికల్లో కూడా ఏపీలో 175 స్థానాలకు, తెలంగాణలో 119 సీట్లకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.