ఎన్నో వ్యయప్రాయాసాలుకోర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెద్దగా ప్రతిఫలం దక్కలేదు. ఎన్నికల తర్వాత కూడా పార్టీ రోజురోజుకూ బలహీనపడుతుండటంతో పార్టీ అధిష్టానం రాష్ట్ర పార్టీ రథ సారథిని మార్చాలనే నిర్ణయం తీసుకుంది. దీంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అధ్యక్షుడిగా మల్లు భట్టి విక్రమార్కను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఇక ఈ ఇద్దరూ కలిసి కొత్త కార్యవర్గాన్ని నియమించి పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. అయితే అసలు పని మొదలుకాకముందే వీరిద్దరి మధ్య విభేదాలు పొడచూపుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ వ్యవహారాలను తనకు వదిలిపెట్టాలని, పార్టీ అనుబంధ సంస్థల సంగతిని భట్టి చూసుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించినట్లు సమాచారం. దీంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో భట్టీ అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అయితే పార్టీని గాడిలో పెడతారని అధిష్టానం నియమించిన ఇద్దరు నాయకుల మధ్యే విభేదాలు రావడంపై కాంగ్రెస్ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలా అయితే పార్టీ పటిష్టత సాధ్యం కాదని, తెలంగాణలో బీజేపీ పార్టీయే టీఆర్‌ఎస్ తర్వాత రెండో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉందని హస్తం నాయకులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక వెంటనే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని వీరిద్దరి మధ్య విబేధాలను దూరం చేయాలని పార్టీ నాయకులు కోరుతున్నారు.