తప్పు చేసే వారు రెండో రకాలు. ఒకటి చేశామని ఒప్పుకునే వారు, రెండు చేయలేదంటూ మొండిగా వాదించి తప్పించుకోవాలని చూసేవారు. ఇక రామలింగరాజు మొదటి కేటగిరికి చెందిన వాడని చెప్పవచ్చు. 'సత్యం'కు సంబంధించి అన్ని నిజాలను బయటపెట్టి స్వయంగా విచారణ ఎదుర్కొవడానికి రామలింగరాజు సిద్ధమయ్యాడు. ఇక అంతేకాకుండా విచారణకు కూడా అన్నివిధాలుగా సహకరించి ఇప్పుడే ఏడేళ్ల జైలు శిక్షనుఅనుభవించడానికి చర్లపల్లికి వెళ్లాడు. దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసే 'సత్యం' వంటికుంభకోణాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమని సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యానించింది. అందుకే తాను చేసిన సేవలను రామలింగరాజు కోర్టు ముందు ఏకరువుపెట్టినా ఏడేళ్ల కాలంపాటు జైలు ఊచలు లెక్కబెట్టమంటూ న్యాయవ్యవస్థ రామలింగరాజును ఆదేశించింది.
రామలింగరాజు విషయంలో కొందరు ఆయన్ను సమర్థిస్తుండగా... మరికొందరు తగిన శిక్షే పడిందంటున్నారు. ఐటీ రంగంలో ఏమాత్రం చోటులేని హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చడంలో 'సత్యం' పాత్ర కూడా ప్రధానమైనదని చెప్పడానికి అనుమానం అక్కరలేదు. అంతేకాకుండా 50 వేల మందికి వేలాది రూపాయల వేతనంతో ఆ కంపెనీ ఉపాధి చూపించింది. అటు తర్వాత 104, 108 అంటూ 'సత్యం' లక్షలాది మంది ప్రాణాలను కూడా కాపాడిందనేది కాదనలేని నిజం. ఆ కంపెనీ చూపించిన తప్పుడు లెక్కలతో వేలాది మంది ఇన్వెస్టర్లు నష్టపోయారు. ఓ సమయంలో వంద రూపాయలు ఉన్న కంపెనీ షేర్ విలువ రూ. 10కి పడిపోయి ఇప్పుడు తిరిగి యథాస్థానం వైపు పయనిస్తోంది. అంటే ఇన్వెస్టర్లు అప్పుడే షేర్లు అమ్ముకోకుంటే వారు నష్టపోయేవారు కాదు. ఇక వేలాది మంది ఆర్థికంగా నష్టపోయినా లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన రామలింగరాజుకు కాస్తపుణ్యఫలం దక్కాల్సిందే. అదే సమయంలో వేలాది కోట్ల రూపాయల రుణాలు పొందుతూ బ్యాంకులను ముంచుత్తున బడాబడా బిజినెస్‌మ్యాన్ల కంటే కూడా రామలింగరాజు పక్కా జెంటిల్‌మన్ అని ఆయన సమర్థిస్తున్న వారు చెబుతున్నారు.
ఇక ఇటీవలే బెయిల్ పొందిన తర్వాత కూడా రామలింగరాజు ప్రజాసేవకు సంబంధించి ఓ వినూత్నమైన కార్యమ్రాన్ని అమలుచేసేందుకు ప్రణాళిక రూపొందించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గ్రామీణ, రెండోస్థాయి పట్టణ ప్రాంతాల ప్రజలకు ఇంటివద్దకే వచ్చి అన్ని రకాల వైద్యసదుపాయాలను అందించడానికి ఆయన సరికొత్త వ్యవస్థను రూపొందించే పనిలో ఉండగానే సీబీఐ కోర్టు తుది తీర్పును వెలువరించిందని, దీంతో రాజు కోర్టుకు వెళ్లక తప్పలేదని వారు చెబుతున్నారు. మరి 'సత్యం' కేసులో రామలింగరాజుకు శిక్షపడినా.. చేసిన తప్పును అంగీకరిస్తూ చిరునవ్వుతో జైలుకు బయలుదేరిన రామలింగరాజు నిజంగానే రాజు అంటూ ఆయన వ్యక్తిత్వం గురించితెలిసి వారు చెబుతున్నారు.