గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘లయన్’ ఆడియో ఆవిష్కరణలో నందమూరి బాలకృష్ణ ఆవేశ పూరితంగా స్పందించిన విషయం తెలిసిందే. ‘‘అభిమానులు చూపించే ప్రేమానురాగాలతో ముందుకెళతాను గానీ కాలంతోపాటు గాలిలో పరిగెత్తే వాడు మీ నందమూరి బాలకృష్ణ కాదు’’ అని ఆయన తేల్చి చెప్పారు. ‘అభిమానుల అండగా ఉన్నంత కాలం బాలకృష్ణ ‘లయన్’గానే ఉంటాడు’ అని అభిమానులు ఉర్రూతలూగేలా మాట్లాడారు. ఇది కాకుండా ‘ఎన్ని చిట్టెలుకలు, చిరుత పులులొచ్చినా ఏమైందో అందరికీ తెలుసు. మన జోలికి వస్తే మాడి మసైపోతారు’ అంటూ కాస్త ఘాటుగా స్పందించారు. చిట్టెలుక, చిరుత పులులు అని ఎవరిని ఉద్ధేశించి అన్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. జూ.ఎన్టీఆర్‌ను ఉద్ధేశించి అనుంటారని కొందరు భావిస్తున్నారు. ఎన్టీఆర్‌కి, బాలకృష్ణకు మధ్య కాస్త గ్యాప్ ఉన్న సంగతి విదితమే. ఎలక్షన్ల వేడిలో కూడా యంగ్ టైగర్‌పై టీడీపీ వర్గాలు నిప్పులు చెరిగాయి. విజయవాడలో కటౌట్ల విషయంలో కొన్ని వివాదాలు కూడా తలెత్తాయి. దానితో నందమూరి అభిమానులకి, ఎన్టీఆర్‌కి మధ్య కాస్త దూరం పెరిగింది. ఆ ప్రభావం ఆ సమయంలో విడుదలైన ఎన్టీఆర్ సినిమాలపై బలంగా పడింది. ఆ సినిమాల ఫలితాలే అందుకు ఉదాహరణ. తెలుగు దేశం పార్టీకి తారక్ నుంచి సరైన సపోర్ట్ లేదని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారని కొందరు అంటుంటే, చిరంజీవి కుటుంబానికి సంబంధించి అన్నాడని ఇంకొందరు అంటున్నారు. ఎందుకంటే పరిశ్రమలో చిరుత సినిమాతో అడుగుపెట్టి చిరుతగా పేరొందింది రాంచరణ్ కాబట్టి బాలకృష్ణ వ్యాఖ్యలు అతనికి కూడా వర్తిస్థాయని పలువురు అంటున్నారు.
తెలుగు సినిమా అవార్డ్ ఫంక్షన్‌లకు నేటి హీరోహీరోయిన్లు హాజరుకారని, ఇది చాలా బాధకరమైన విషయం అని దాసరి నారాయణరావు ఓ వేడుకలో అంటే తర్వాతి రోజు మరో కార్యక్రమంలో సినిమాకు సంబంధించి ఏ కార్యక్రమం కోసమైనా నేటి తరం తారలు యాక్టివ్ గా ఉంటున్నారని రామ్ చరణ్ కౌంటర్ ఇచ్చాడు. వెంటనే బాలకృష్ణ కూడా చరణ్‌కి కౌంటర్ వేశారు. దాసరికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాలయ్య వ్యాఖ్యలకు ఇది కూడా ఓ కారణమని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే బాలయ్య వాఖ్యలు ఎవరిపై అనేది క్లారిటీ రావాల్సి ఉంది.