బాబు, కేసీఆర్‌ల మధ్య సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈయన ఎడ్డెం అంటే ఆయన తెడ్డం అనడం సర్వసాధారణంగా జరిగేది. అయితే వీరిద్దరు మాత్రమే ఒకే కాంట్రాక్టర్‌కు మద్దతుగా నిలవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అదికూడా తీవ్ర విమర్శిల్ని ఎదుర్కొంటున్న ఆ కాంట్రాక్టర్‌ను వీరు దూరం చేసుకోవడం లేదు. ప్రస్తుతం ఏపీలో పట్టిసీమ ప్రాజెక్టు గురించి, తెలంగాణలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు గురించి తీవ్రంగా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ప్రతిపక్షాల విమర్శల్ని కూడా లెక్క చేయకుండా వీరిద్దరూ ఒక కాంట్రాక్టర్ కోసం ఏకమవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పట్టిసీమ ప్రాజెక్టును మెగా ఇన్‌ఫ్రాస్టక్చర్ కంపెనీ దక్కించుకుంది. ఇక తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ. 20 వేల కోట్లతో చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును కూడా ఇదే కంపెనీ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వమే చేపడుతుందని ప్రకటించారు. ఇప్పుడు మాత్రం ఈ ప్రాజెక్టును మెగా ఇన్‌ఫ్రాస్టక్చర్ కంపెనీకి అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే పట్టిసీమను ఏడాదిలోగా.. వాటర్‌గ్రిడ్‌ను మరో మూడేళ్లలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీ పనులను త్వరగా పూర్తి చేస్తుందని ఈ ప్రాజెక్టును అప్పగించారా..? లేక వేరే ఏదైనా కారణముందా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.