నల్లగొండ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఎస్‌ఐ సిద్ధయ్య చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతణ్ని కాపాడటానికి వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు నలుగురు పోలీసులు మృతిచెందారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సీఐ బాలగంగిరెడ్డి డిశ్చార్చి అయ్యారు. ఇక సిద్ధయ్యను కాపాడటానికి ఎంత ఖర్చైనా భరిస్తామని, అవసరమైతే విదేశాలకైనా పంపడానికి సిద్ధమని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వైద్యులు నాలుగు రోజులుగా ఆయన్ను కాపాడటానికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఆయన భార్య రెండు రోజుల క్రితమే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కాల్పుల్లో సిద్ధయ్య శరీరంలోకి నాలుగు బులెట్లు దూసుకుపోగా మూడింటిని వైద్యులు తొలగించారు. ఇక మెదడులో ఉండిపోయిన నాలుగు బులెట్ సిద్ధయ్య ప్రాణాలను హరించింది. సిద్ధయ్య మృతితో నల్లగొండ జిల్లా పోలీస్‌యంత్రాంగం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.