తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదినెలలు కావస్తున్నా.. ఇంకా ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఉండటంతో తెలంగాణ న్యాయవాదులు నష్టపోతున్నట్లు వారు చెబుతున్నారు. ఈ తరుణంలోనే ఆ ప్రాంతంలో రోజూ న్యాయవాదుల సమ్మెలు, నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. అయితే హైదరాబాద్‌లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు స్థలంకేటాయిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ కొత్త హైకోర్టును ఏర్పాటుచేయాల్సింది ఆంధ్రప్రదేశ్‌లోగాని తెలంగాణలో కాదన్న వాదనను ఉమ్మడి హైకోర్టు ముందుకు తీసుకువచ్చింది. అయితే ఏపీలో కొత్త హైకోర్టు నిర్మాణానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం లేదని, కాబట్టి తెలంగాణకే కొత్త హైకోర్టు ఏర్పాటుచేయాలని తెలంగాణ న్యాయవాదులు వాదించారు. దీనిపై ఎట్టకేలకు చంద్రబాబు స్పందించారు. ఏపీలో కొత్త హైకోర్టు ఏర్పాటుకు తాను అనుకూలమేనని, త్వరనలోనే దానికి సంబంధించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. తెలంగాణలో న్యాయవాదుల సమ్మె కేసీఆర్‌కు కూడా తలనొప్పిగా మారింది. ఈ తరుణంలో చంద్రబాబు ప్రకటన కేసీఆర్‌కు కాస్త ఊరటనిచ్చేదేనని చెప్పవచ్చు.