ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి వాజ్‌పేయ్, అద్వానీలు రథచక్రాలుగా సాగారు. ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో వారిద్దరి కృషిని ఎప్పటికీ విస్మరించలేం. ఇక మోడీ మానియా ప్రారంభమైన తర్వాత అద్వానీ ప్రతిష్ట మసకబారడం ప్రారంభమైంది. ఎన్నికలకు ముందే మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీ అంతర్గత విభేదాలు బహిరంగమయ్యాయి. ఇక అప్పటినుంచి అద్వానీకి కష్టాలు మొదలయ్యాయి. ఆయనకు ఇష్టం ఉన్న స్థానంలో పోటీ చేయడానికి కూడా చివరకు పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. అంతేకాకుండా ఆయనకు వయసు దాటిందంటూ మంత్రి పదవికి కూడా దూరం ఉంచారు. ఇక తరచూ తన అసంతృప్తిని మీడియా ముందు వెళ్లగక్కితే చులకనైపోతానని భావించిన అద్వానీ ఇక మీడియా ముందుకు రావడమే మానేశారు. ఇన్నాళ్లకు మళ్లీ ఆయన బెంగళూరులో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో కూడా మోడీతో అద్వాని ముభావంగానే మెలిగారు. సభా వేదికపై వారిద్దరి మధ్య మాటలు కూడా కరువయ్యాయి. అంతేకాకుండా వేదికపై ప్రసంగించాలని అద్వానీని అమిత్‌షా కోరినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. బీజేపీ అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలైనా మోడీ, అద్వానీల మధ్య సంబంధాలు మెరుగుపడకపోవడం పార్టీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. బీజేపీలో భీష్మపితామహుడు వంటి అద్వానీకి మోడీ హయాంలో తగిన గౌరవం దొరకడం లేదనన్న వాదనలు వినిపిస్తున్నాయి.