ఇప్పుడు ఏపీ, తెలంగాణల మధ్య ఎంట్రీ ట్యాక్స్ సరికొత్త వివాదాన్ని రేపుతోంది. ఈ వివాదంలోకి గవర్నర్ నరసింహన్‌కూడా ఓ పత్రిక లాక్కొచ్చింది. గవర్నర్ నిక్కచ్చిగా వ్యవహరించకపోవడంతోనే ఏపీ, తెలంగాణల మధ్య తరచూ వివాదాలు వస్తున్నట్లు ఆ పత్రిక ప్రచురించింది. అంతేకాకుండా గవర్నర్ తెలంగాణపై ప్రత్యేక అభిమానం కనబరుస్తున్నట్లు కూడా ఆ పత్రిక ప్రచురించింది. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే ఆ పత్రిక కథనాలు రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతున్నాయి. గతంలో కూడా గవర్నర్‌పై తెలంగాణలో తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలంగాణ పోరాటానికి వ్యతిరేకంగా గవర్నర్ కేంద్రానికి నివేదికలు పంపుతున్నారని, ఆయన సమైక్యాంధ్ర వైపే మొగ్గుతున్నట్లు ప్రత్యేకవాదులు ఆయన్ను విమర్శించారు. ఇక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన్ను మళ్లీ తెలంగాణవాదిగా ముద్ర వేసేందుకు ఓ ప్రముఖ పత్రిక కథనాలు ఎందుకు ప్రచురిస్తుందోనన్న విషయం అర్థంకాకుండా ఉంది. మరి ఈ విమర్శలను ఎదుర్కోవడానికి గవర్నర్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో వేచిచూడాల్సిందే.