ఏప్రిల్ 1 నుంచి రెండు రాష్ట్రాల్లో వాహనాలకు ఎంట్రీ ట్యాక్సు విధించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2015 మార్చి 31 వరకు వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్ విధించకూడదని గవర్నర్ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. మరో రెండు రోజుల్లో ఈ గడువు పూర్తవనుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ ట్యాక్స్‌ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదట దీనికి అంగీకరించలేదు. ఉమ్మడి రాష్ట్రంగా హైదరాబాద్ కొనసాగినంత కాలం కూడా ఎంట్రీ ట్యాక్స్‌ను విధించకూడదని వాదించింది. అయితే దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించకతప్పలేదు. చివరకు ఇక తెలంగాణ బాటలోనే ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం నుంచే వచ్చే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఇరు రాష్ట్రాల ప్రజలకు భారంగా మారనుంది. ఇక అటునుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్లే వాహనాలు ఎంట్రీ ట్యాక్స్‌లు చెల్లించనుండటంతో వస్తువుల ధరలు, ప్రయాణ చార్జిలు కూడా పేరిగే అవకాశం ఉంది.