పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై తీవ్ర విమ్శలు వెల్లువెత్తుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికే ఈ ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టారని టీడీపీని మినహాయించి మిగితా పార్టీలన్ని కూడై కూస్తున్న సంగతి తెలిసిందే. అయినా లెక్కపెట్టని చంద్రబాబు ఆదివారం ఆ ప్రాజెక్టు పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు చిన్నరాజప్ప, దేవినేని ఉమ, మాణిక్యాలరావు, సుజాత, ఎంపీ మాగంటి బాబు తదితరులు హాజరయ్యారు. ఇక ఈ ప్రాజెక్టుకు మొదట స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం వాస్తవమేనని, కాని ఇప్పుడు వారంతా ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా మారారని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలకు ఎలాంటి నష్టం చేకూర్చకుండా రాయలసీమకు పట్టి సీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో నీరందిస్తామన్నారు. ఇక ఏడాదిలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఇక ఈ ప్రాజెక్టుతో పొలవరం ప్రాజెక్టుకు ముప్పు ఉండదని, కేవలం గోదావరిలోని వరద నీటిని మాత్రమే పట్టి సీమకు తరలిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది రాష్ట్రంలో నదుల అనుసంధానానికి మరో మెట్టు అంటూ అభివర్ణించాడు. ఇక వచ్చే నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తానని బాబు చెప్పుకొచ్చారు. అయితే వేల కోట్ల రూపాయలు అవసరమైన పోలవరాన్ని పూర్తి చేయడానికి కేంద్రం ఈ ఏడాది వంద కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ లెక్కన చంద్రబాబు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.