చంద్రబాబుకి ‘మోరల్ సపోర్టు’ ఇవ్వడం ఆంధ్రుల తక్షణ కర్తవ్యం
కురుక్షేత్రంలో కౌరవ సేనావాహినిని, భీష్మద్రోణ కృపాచార్యులాది పెద్దలను చూసిన అర్జునునివలె కనిపిస్తున్నారు ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి విదేశీ ప్రయాణాన్ని ప్రధాని నిలిపివేయడాన్ని జీర్ణించుకోవడం కష్టం. పోలవరం ప్రాజెక్టుకి నిధులు నిల్. పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని అడ్డుకుంటున్న వైఎస్సార్‌సీపీ. ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్ధి చైతన్యరాజు పరాజయం. అసెంబ్లీలో అగ్లీసీన్స్. లోటు బడ్జెట్. ఎన్నికల హామీలు అమలు చేయలేని ఆర్ధిక సమస్యలు. దూసుకుపోతున్న కెసిఆర్. తాను కర్ణాటక ఎంపీనని మాట మార్చిన వెంకయ్య నాయుడు. టిడిపి సహకారంతో రాజ్యసభకు ఎంపికయిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చిరుబురులు. సభలో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు.
అంతటా గందరగోళం. టెన్షన్. ఊపిరాడని స్థితి. ఇటువంటి సమయంలోనే ఎంతగొప్ప నాయకుడయినా వ్యూహాత్మక తప్పిదాలు చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. తప్పులు చేసేలా చూస్తారు ప్రత్యర్ధులు. ఈ క్లిష్ట సమయంలో పార్టీలకు కులమతాలకు అతీతంగా ఆంధ్రులందరూ చంద్రబాబుకి అండగా నిలవాలి. నైతిక బలమివ్వాలి. మీ వెనుక మేమున్నాం అని ప్రవాసాంధ్రులు చంద్రబాబుకి నైతిక బలమివ్వాలి. త్యాగాలకు సిద్ధమని పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి.
- తోటకూర రఘు