‘పెప్పర్‌ స్ప్రే’ అపప్రదని తుడిచేసిన జగన్, జానా!


‘పెప్పర్‌ స్ప్రే’ అపప్రదని తుడిచేసే ప్రయత్నం చేసిన జానారెడ్డి, జగన్మోహనరెడ్డి!

సభాపతి కావచ్చు, సభానాయకుడు కావచ్చు, రాష్ట్రమంత్రి కావచ్చు, శాసన సభ్యుడు కావచ్చు నిండు సభలో ఈ నలుగురిలో ఏ ఒక్కరిపట్ల అయినా ప్రతిపక్ష సభ్యులు సభా మర్యాద పాటించకుండా మాట్లాడితే ప్రతిపక్షనేత హుందాగా తమ శాసన సభ్యులచే క్షమాపణ చెప్పించిన సంఘటన తెలంగాణ అసెంబ్లీలో జరిగితే తమ శాసన సభ్యుల తరఫున ప్రతి పక్షనేత క్షమాపణ చెప్పిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జరిగింది. డికె అరుణ తదితరులతో తెలంగాణ అసెంబ్లీలో క్షమాపణ చెప్పించి రికార్డులకెక్కిన ఆ ఘనాపాటి కె.జానారెడ్డి; ఆంధ్రాలో రోజా, కొడాలి నాని తదితరుల తరఫున క్షమాపణ చెప్పింది ప్రతిపక్షనాయకుడు జగన్మోహనరెడ్డి. ఈ ప్రతిపక్ష నాయకులకు ధీటుగా ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తికూడా విచారం చేయడం వలన సభా గౌరవం పెరిగింది. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి బడ్జెట్‌పై ప్రసంగిస్తూ గతంలో ఇచ్చిన బడ్జెట్‌ అంకెలను పొద్దులవారీగా యధాతధంగా దించేశారని చదువుతుంటే అధికార పక్షం - టిఆర్‌ఎస్‌ సభ్యులు హేళన చేశారు : ‘మా సభ్యులు సభలో పొరపాటున మాట జారితే క్షమాపణ చెప్పించాను. సభలో బడ్జెట్‌పై నేను మాట్లాడుతుంటే మీరు గొడవ చేస్తున్నారు. నిరసనగా వాకౌట్‌ చేయగలం. నాలుగేళ్ళ తర్వాత, మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాతే సభలో కాలుపెడతాం’ అనగానే ముఖ్యమంత్రి కెసిఆర్‌ లేచి విచారం వ్యక్తం చేశారు; ప్రతిపక్ష నాయకుని సూచనలు శిరోధార్యమని హుందాగా ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్‌ సభాపతి కోడెల శివప్రసాద్‌కు ప్రతిపక్షనేత జగన్మోహనరెడ్డి తమ సభ్యులు తెలిసో తెలియకో నొప్పి కలిగించే విధంగా వ్యవహరించివుంటే తాను అందుకు క్షమాపణ కోరుతున్నానని అసెంబ్లీలో చెప్పారు. తదుపరి వైయస్సార్‌ సీపీ శాసన సభ్యులు శ్రీకాంత్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌ కుమార్‌, బి.ముత్యాల నాయుడు, రోజా, కొడాలి నాని ఒక్కొక్కరుగా క్షమాపణలు చెప్పారు.

విజ్ఞతతో వ్యవహరించిన ఆంధ్రా - తెలంగాణ ప్రతిపక్ష నేతలకు తెలుగుజాతి కృతజ్ఞతలు తెలుపుతోంది. లేకుంటే  ‘పార్లమెంటులో పెప్పర్‌ స్ప్రే చేసిన తెలుగు ఎంపీ’ అన్న అపఖ్యాతిని ఇప్పటికే మూటగట్టుకున్నాం; తాజాగా శాసన సభాపతిపైన కూడా అవాకులు చవాకులు పేలిన వారిగా మిగిలిపోయేవారం!

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES