మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్ష పదవి ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్‌కు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. రోజురోజుకూ జయసుధకు మద్దతు పెరుగుతుండటం రాజేంద్రప్రసాద్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇక మెగా ఫ్యామిలీ మద్దతు ఆయనకు కొంత ఊరటనిస్తున్నా.. తన మద్దతుదారులు ఒక్కొక్కరిగా హ్యాండిస్తుండటం రాజేంద్రప్రసాద్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆయన ప్యానెల్‌కు చెందిన ఉత్తేజ్, శివాజీరాజలు ఇప్పుడు అకస్మాత్తుగా పోటీనుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతోనే వారు పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినా.. దీని వెనుక వేరే కారణాలున్నాయనే వాదనలు వినబడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఇండస్ట్రీలో చీలిక తెస్తున్న ఈ ఎన్నికలతో తాము ఓ వర్గానికే పరిమితమైపోతామనో లేక ఓటమి భయంతోనో వారిద్దరూ వెనుకడుగు వేసి ఉంటారని సమాచారం. ఇక జయసుధ తరఫున మురళీమోహన్ అన్ని తానై నడిపిస్తుండటం రాజేంద్రప్రసాద్‌కు మరింత ఆందోళన కలిగిస్తోంది.