2014 ఎన్నికలకు ముందు పలువురు నటీనటులు నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీలో చేరారు. వారిలో హీరో శివాజీ కూడా ఉన్నారు. విభజనతో నష్టపోయిన ఏపీకి బీజేపీ హయాంలో న్యాయం జరుగుతుందని, కమలం గుర్తుకే ఓటు వేయాలంటూ వీరంతా ప్రచారం చేశారు. ఇక అదే సమయంలో జనసేన పార్టీని స్థాపించిన పవన్‌కల్యాణ్ కూడా బీజేపీ-టీడీపీల కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ కూటమికే ఓటు వేయాలంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీజేపీతోనే ఏపీకి మేలు జరుగుతుందంటూ ప్రసంగాలతో హోరెత్తించారు. అయితే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం బీజేపీ ఆంధ్రప్రదేశ్ సాధకబాధకాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూడా బీజేపీ చర్యలు తీసుకోలేదు. అయినప్పటికీ పవన్‌కల్యాణ్ కేంద్రాన్ని ఒక్కసారి కూడా నిలదీసిన దాఖలాలు లేవు. అదే బీజేపీ పార్టీలో చేరిన శివాజీ మాత్రం ఏపీకిచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తన అభిప్రాయానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదని తెలిసి కూడా ఏపీకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై బీజేపీ అధిష్టానానికి ఆగ్రహం వస్తుందని తెలిసి కూడా శివాజీ ఎక్కడా వెనక్కితగ్గకపోవడం గమనార్హం. పవన్‌కల్యాణ్ స్థాయి వ్యక్తి హామీల అమలుకు డిమాండ్ చేస్తే కేంద్రంపై ఎంతోకొంత ఒత్తిడి పెరుగుతుందన్న విషయం వాస్తవం. కనీసం శివాజీ చూపుతున్న చొరవ కూడా పవన్ చూపకపోవడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పవన్‌కంటే కూడా శివాజీయే నయమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.