తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేయాలనే డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది. ఇక టీ-ప్రభుత్వం తగిన స్థలం చూపిస్తే హైకోర్టు ఏర్పాటు చేయడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏర్పాటుకు తగిన స్థలం గురించి టీ-సర్కారు హైదరాబాద్‌లో అన్వేషణ ప్రారంభించింది. అయితే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రస్తుతమున్న హైకోర్టు తెలంగాణకే చెందుతుంది. ఏపీకే కొత్త హైకోర్టును ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. అయితే కొత్త హైకోర్టు ఏర్పాటుకు ఏపీ ఎలాంటి ప్రాధాన్యతనివ్వడం లేదు. అంతేకాకుండా కేంద్రంపై కూడా ఒత్తిడి తేవడం లేదు. దీంతో తెలంగాణలోని న్యాయవాదులు తమకు కొత్త హైకోర్టు ఏర్పాటుచేయాలంటూ డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. వీరికి టీ-సర్కారు కూడా జతకలిసింది. అయితే కేంద్రం తెలంగాణకు కొత్త హైకోర్టును ఏర్పాటుచేస్తే ప్రస్తుతం కొనసాగుతున్న హైకోర్టును ఏం చేస్తారని, ఇక్కడున్న సిబ్బంది ఎటు పోతారనేది తేలకుండా ఉంది. ఇప్పుడు ఇదే అనుమానాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా లేవనెత్తారు. మరి విభజన చట్టంలో మార్పుచేసి ప్రస్తుతమున్న హైకోర్టును ఏపీకి కేటాయించి తెలంగాణకు కొత్త హైకోర్టు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైన త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.