పవన్‌కల్యాణ్ రాజకీయ ఎంట్రీ ఏపీలో పరిస్థితులను తలకిందులుగా మార్చింది. నువ్వానేనా అన్న రీతిలో వైసీపీ, టీడీపీల మధ్య కొనసాగిన పోరులో పవన్ మద్దతుతో తెలుగుదేశం విజయబావుటా ఎగురవేసింది. అయితే 'జనసేన' పేరుతో పార్టీ స్థాపించిన పవన్ కల్యాన్ 2014 ఎన్నికల్లో మాత్రం కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత కూడా అంశాలవారీగా స్పందించడమే తప్పించి రాజకీయాల గురించి పవన్ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. అయితే జనసేన పార్టీకి ఇప్పుడు పెద్ద చిక్కేవచ్చి పడింది. ఐదేళ్లలోపు ఏ ఎన్నికల్లోనూ పోటీచేయని పార్టీల గుర్తింపును రద్దు చేస్తామనని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి హెచ్‌ఎస్ బ్రహ్మ వెల్లడించారు. ఇప్పటికే జనసేన పార్టీ స్థాపించి ఏడాది గడచింది. మరో నాలుగేళ్లవరకు తెలుగునాట ఎన్నికలు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో జనసేనకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి తలెత్తింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఐదేళ్లగడువును పదేళ్ల వరకు కూడా పొడగిస్తామని హెచ్‌ఎస్ బ్రహ్మ ప్రకటించారు. ఇది కొంచెం జనసేనకు ఊరటనిచ్చే అంశమే. మరోవైపు ఇరు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎమ్మెల్యే, ఎంపీ శాసనసభ స్థానాల్లో జనసేన తప్పకుండా బరిలోకి దిగాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.