తెలుగు దినపత్రికల్లో ఒకప్పుడు టీఆర్‌ఎస్‌కు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు బద్ధ శత్రువులు. ఈరెండు పత్రికల పేర్లు చెబితనే గులాబి దళం అంతెత్తున ఎగిసిపడేది. ఇక తాము అధికారంలోకి వస్తే రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తామని కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. అలాగే ఆంధ్రజ్యోతి పనికూడా పడతామని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఏబీఎన్ ప్రసారాలు నిలిచిపోవడంతో ఈనాడుకు కూడా అదేగతి పడుతుందని అందరూ భావించారు. అయితే కేసీఆర్ మాత్రం ఫిల్మ్‌సిటీకి వెళ్లి ఓ రోజంతా గడపడమే కాకుండా, ఫిల్మ్‌సిటీ తెలంగాణకే తలమానికమని ప్రకటించి అందర్ని విస్మయానికి గురిచేశారు. ఆ తర్వాత ఈనాడు దినపత్రిక టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వార్తలు రాయడం తగ్గించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక టీఆర్‌ఎస్ వర్గాలు కూడా ఈనాడును వదిలిపెట్టి కేవలం ఆంధ్రజ్యోతిపైనే తమ విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇంతకుముందు ఈనాడు, ఆంధ్రజ్యోతిలను టీడీపీ వర్గం పత్రికలంటూ ప్రచారం చేసిన టీఆర్‌ఎస్ ఇప్పుడు కేవలం ఆంధ్రజ్యోతి మాత్రమే చంద్రబాబు కుట్రల పుత్రిక అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇక రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కనుక రాధాకృష్ణ, కేసీఆర్‌లు కూడా ఓ ఒప్పందానికి వస్తే తెలంగాణలో అధికారపక్షానికి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికే ఉండందంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.