రాజకీయ నాయకుల కుమారులు కూడా తమ తండ్రుల స్థానాల్లో ప్రజాప్రతినిధులుగా ఎదగడం వారసత్వపు హక్కుగా భావిస్తారు. తమకు నాయత్వ లక్షణాలు లేకున్నా.. ప్రజాప్రతినిధుల ఇంట్లో పుట్టడంతోనే వారి రాజకీయ అరంగేట్రానికి తొలి అడుగు పడుతుంది. అయితే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, అందునా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ చదువులో రాణించని తన కుమారుణ్ని రాజకీయాల్లోకి తెచ్చే ప్రస్తావనే లేదని రాజస్తాన్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే తేల్చిచెప్పారు. అంతేకాకుండా కేవలం 8వ తరగతి మాత్రమే చదివిన తన కుమారుణ్ని వ్యవసాయశాఖలో ప్యూన్ ఉద్యోగం ఇంటర్వ్యూకు పంపించాడు. వాడి చదువుకు అంతకుమించి పెద్ద ఉద్యోగం ఆశించడం కూడా తప్పేనని, వ్యాపార రంగంలోకి కూడా పంపదలుదుకోలేదని, అందుకే ప్యూన్ ఉద్యోగం ఇంటర్వ్యూకు పంపించినట్లు రాజస్తాన్‌లోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే హీరాలాల్ వర్మ స్పష్టంచేశారు. హీరాలాల్ తీరుపై రాజకీయ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తుండగా.. విద్యావేత్తలు మాత్రం హర్షం ప్రకటించారు.