పవన్ కళ్యాణ్ గారూ ... ఈ పని ఎప్పుడో చేయాల్సింది- ఆలస్యం చేశారు!
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా -
పోలవరానికి నిధులు -
లోటుబడ్జెట్ వున్న ఆంధ్రప్రదేశ్‌కి ఆర్ధికసాయం -
రాష్ట్ర విభజన బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు, ప్రతిపక్షస్థానంలో వున్న వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కోసం పోరాడారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన డిమాండ్స్‌ని పక్కన పెట్టినందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి అనుకూలంగా గళం విప్పడంలో తప్పులేదు. కానీ రాజధాని భూ విషయంలో చంద్రబాబు పోకడని తప్పుపడుతున్న పవన్ కళ్యాణ్ దృష్టికి మరికొన్ని విషయాలు తీసుకురాదలిచాం.
రాష్ట్ర బడ్జెట్ లోటులోవుంది. జీతాలుకూడా ఇవ్వలేని స్థితిలో వుంది. మిగులు బడ్జెట్‌వున్న తెలంగాణతో పోటీపడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్ ప్రకటించారు చంద్రబాబు. బాగానేవుంది, కానీ ఈ ప్రభుత్వోద్యోగులు ఉమ్మడి రాష్ట రాజధాని హైదరాబాదు విడిచి తాతాల్కిక రాజధానికి తరలిరావడానికి నూటొక్క షరతులు విధిస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు హైదరాబాదునుండి తాత్కాలిక రాజధానికి తరలిరావాలన్న షరతుని 43% ఫిట్‌మెంట్ ప్రకటించేముందు చంద్రబాబు ఎందుకు విధించలేదు?
` రాష్ట్ర విభజనకు తన అంగీకారాన్ని ఏకవాక్యంలో చెప్పిన చంద్రబాబు ఆ రోజునే రాష్ట్ర రాజధాని -నీళ్ళు - నిధుల విషయం ముందుగా తేల్చి రాష్ట్రాన్ని విభజించాలన్న షరతు పెట్టలేక పెద్ద పొరపాటు చేశారు. ఈ రోజున ఉద్యోగుల విషయంలోనూ అదే పొరపాటు చేశారు. ఈ రోజున ప్రభుత్వోద్యోగులు చంద్రబాబుని ఖాతరు చేయడంలేదు.
రాష్ట్రం లోటు బడ్జెట్‌లో వుంది, కానీ పండుగలకి పబ్బాలకి పప్పులు ఉప్పు బెల్లం బియ్యం - ఉచితంగా! ఆడపిల్లల పెళ్ళిల్లకి పదివేలు -ఇరవైవేలు ‘ఆడపిల్ల పెళ్ళి కానుక’. రైతులకి, డ్వాక్రా మహిళలకి బంగారం తాకట్టు రుణమాఫీ. ఉచిత విద్యుత్తు ` ఫీజుల రీ`ఇంబర్స్‌మెంట్ ` హెల్త్ కార్డులు : అన్నీ ఫ్రీఫ్రీఫ్రీ!
తెలంగాణ ముఖ్యమంత్రి క్రిస్టియన్లకి కోట్ల ఖర్చుతో ప్రార్ధనాలయాలను నిర్మిస్తానని వాగ్దానం చేశారు, మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఆ స్థాయి ప్రకటనలే గుప్పించారు, హజ్‌హౌస్ డిక్లేర్ చేశారు.
ఓ వైపు దాన కర్ణునిలా ఉచిత హామీలు గుప్పిస్తూ మరోవైపు కేంద్రం వద్ద చంద్రబాబు బీద అరుపులను మీరెలా సమర్ధించారు పవన్ కళ్యాణ్ గారూ!
రాష్ట్ర రాజధాని విషయమై ముందుగా ఒంగోలు, తర్వాత నూజివీడు, ఆపైన కృష్ణ - గుంటూరు, తాజాగా తుళ్ళూరు, వేల ఎకరాలు. వికేంద్రీకరణ అంటే ఇదా? పవన్‌కళ్యాణ్‌గారూ, ఇప్పుడు కాదు ఎప్పుడో మీరు గళం విప్పాల్సింది. ఆలస్యం చేశారు.
(మరికొంత రెండో భాగంలో)