సినిమా పరిశ్రమలో మళ్ళీ రాజుకున్న వివక్ష!!
మొన్నటివరకు చెన్నై నుంచి వచ్చే డాన్సర్లు, ఫైటర్స్ పట్ల నిరసన గళాలు వినిపించారు హైదరాబాదులో స్ధిరపడ్డ అసోసియేషన్స్.
నిన్నటివరకు తెలంగాణ వారిని ప్రోత్సహించడంలేదని, సీమాంధ్ర దర్శక నిర్మాతలపై ధ్వజమెత్తారు.
నేడు, అమరులయిన సినీ ప్రముఖులకు నివాళులర్పించడంలో వివక్ష చూపుతున్నారని రచ్చ చేస్తున్నారు. అక్కినేనితో ఈ వివాదం మొదలయి రామానాయుడుతో పతాకస్థాయికి చేరింది. తెలుగు సినిమా పరిశ్రమని హైదరాబాదుకి తరలించడానికి నడుంబిగించింది ఒకరయితే, హైదరాబాదులో తెలుగు సినిమా పరిశ్రమ నిలదొక్కుకోవడానికి పిడికిలి బిగించింది మరొకరు. వారి కెరీర్‌లో ఎందరెందరో, ఎన్నెన్ని మలుపులో!
ఒకరు చనిపోతే పదిమందీ పోగవ్వడమన్నది మన సంప్రదాయం, మన సంస్కారం, చనిపోయిన వ్యక్తికి వున్న సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన విషయం. ఎవర్నీ బొట్టుపెట్టి పిలవరు.
సినిమా పరిశ్రమలో ఏ క్రాఫ్ట్‌కి ఆ క్రాఫ్ట్‌గా అసోసియేషన్స్ వున్నాయి. ఎవరైనా చనిపోతే ముందుగా స్పందించవలసింది ఆ అసోసియేషన్ కార్యవర్గం. పార్ధివ శరీరాన్ని ఫిలిమ్ ఛాంబర్‌కి / తమ అసోసియేషన్ కార్యాలయానికి ప్రజల సందర్శనార్ధం తీసుకురావడమన్నది ఆ అసోసియేషన్ బాధ్యత. ఈ విషయమై ‘రచ్చ’ చేయడం తగదు. సినిమా పరిశ్రమకు చెందిన ఎవరు మరణించినా మీడియా ఘన నివాళి సమర్పిస్తూనే వున్నది.
పెళ్ళికి తద్దినానికి తేడా వుంది. ఆహ్వానం అందితేనే పెళ్ళికి హాజరవుతాం. చావు కబురు చేరగానే పార్ధివ శరీరానికి కడసారి అంజలి ఘటించడానికి బారులు తీరతాం. ఇది సభ్యతకు, విజ్ఞతకు సంబంధించిన విషయం. చర్చనీయాంశంకాదు.
-తోటకూర రఘు