భారతీయతకు నిలువెత్తు ప్రతిబింబం ‘మోదీ’
2014 ఎన్నికలలో బిజెపి అఖండ విజయానికి, కాంగ్రెసు పరాజయానికి గల కారణాలను విశ్లేషిస్తూ హిందువుల ఓట్లన్నీ బిజెపికి పడటం వలనే బిజెపి గెలిచింది, కాంగ్రెసు ఓడిరది అని తీర్మానించింది కాంగ్రెసు కోటరీ.
2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పరాజయానికి ప్రధాని నరేంద్రమోది, పది లక్షల డిజైనర్ సూటు ధరించడమేనని విశ్లేషించారు రాజకీయ పండితులు.
ఈ దశాబ్దపు అత్యుత్తమ హాస్య వ్యాఖ్యలుగా ఈ రెండిరటిని పరిగణించవచ్చు.
హిందువుల ఓట్లన్నీ బిజెపికి పడితే తెలంగాణలో కెసిఆర్, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, తమిళనాడులో జయలలిత, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ విజయభేరి ఎలా మోగించగలిగారు?
అలాగే, బిజెపిని వెన్నంటివున్న హిందువులంతా మోదీ పది లక్షల డిజైనర్ సూటుచూసి బిజెపిని పక్కన పెట్టారనుకోవాలా?
అధికార పార్టీపట్ల వ్యతిరేకత వుండటం సహజం. కాంగ్రెసు అధికార పక్షంలోనే గాక ప్రతిపక్షంలో కూడా హుందాగా కూర్చోవడానికి అలవాటుపడక అసహనం ప్రదర్శించడంవలన ప్రజలకు మరింత దూరమవుతారు. ఒకప్పుడు భారతీయులంటే పాముల్ని ఆడిస్తూ బతుకుతారని, ఎలుకల్ని కాల్చుకుతింటారని, సంచార జాతులని, బతుకుదెరువు కోసం పరదేశాలకు వెళ్తారని పాశ్చాత్యులు అభిప్రాయపడేవారు. ఇప్పుడు ఆ అభిప్రాయం పటాపంచలయింది. చైనాతో అభివృద్ధిలో పోటీపడుతూ సూపర్‌పవర్‌గా ఎదుగుతున్న భారత్ భాగస్వామ్యాన్ని పాశ్చాత్య దేశాలు కోరుకుంటున్నాయి. భుక్తికోసం వచ్చే వలస పక్షలుగాకాక మేధో సంపన్నులుగా పాశ్చాత్యుల ఆహ్వానంపై వస్తున్న విశిష్ట అతిధులుగా భారతీయులు పాశ్చాత్యదేశాలలో గౌరవింపబడుతున్నారు. అటువంటి 121 కోట్ల భారతీయుల ప్రతినిధిగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సరసన ఖరీదైన డ్రెస్‌లో, ఇనుమడిరచే ఆత్మ విశ్వాసంతో, సరిసమానంగా కనిపించడం తప్పా? చిరిగి జీరండాలయిన, మాసిన దుస్తులలో బికారిలా, భిక్షగానిలా కనిపించాలని కోరుకుంటున్నారా?
వస్త్రధారణ ఆత్మ విశ్వాస్వాన్ని ప్రతిబింబిస్తుందన్నది మానసిక విశ్లేషకుల అభిప్రాయం.
దిల్లీ ఎన్నికలలో బిజెపి పరాజయానికి కారణాలు మోదీ డిజైనర్ సూట్ అనడం అపరిపక్వ రాజకీయ విశ్లేషకుల ఉవాచ మాత్రమే.
దిల్లీ : భారతీయ రాష్ట్రాలన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది, మేధావులు మొదలు బడుగు జీవులందరికీ బతుకునిస్తుంది. ముస్లిమ్‌లను ప్రభావితం చేయగల ‘బుకారీ’, ఆఫీసు పనివేళల్ని పాటించని లక్షలాది ప్రభుత్వోద్యోగులు, ఉచిత కరెంటు, నీరు, గ్యాస్, రేషను ఆశించే బడుగులు, పన్ను ఎగవేతకు అలవాటుపడ్డ సంపన్నులు, స్మగ్లర్లు కూడా దిల్లీలోనూ వున్నారు. వీరికి బెత్తం మాష్టారు మోదీ అంటే కంటగింపు, ‘ఉచితం’ పేరుతో తాయిలాలు పంచే కేజ్రీవాల్ అంటే క్రేజ్. ఈ కారణాలు చాలు దిల్లీలో బిజెపి పరాజయానికి! ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పధంలో పరుగెత్తించిన చంద్రబాబుని 2004లో వైయస్సార్ ‘ఉచిత’ పధకాలు బోల్తా కొట్టించిన వైనం చారిత్రక సత్యం! నిజాన్ని జీర్ణించుకోవడం కష్టం, కనుకనే ఈ విశ్లేషణలు!
-తోటకూర రఘు