దర్శకుడు రేలంగి నరసింహారావు గారితో నాకున్న అనుబంధంలో అతిముఖ్యమైన పాత్రధారి పూసలగారు. లేబర్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నాటకాలు రాస్తూ, నటించిన ఈ స్నేహశీలి సినిమా ప్రస్థానంలో హాస్య ప్రధాన చిత్రాలు ఎక్కువ.
నా రచన ‘‘ముగ్గురమ్మాయిల మొగుడు’’ స్క్రిప్టు డిస్కషన్ దశలో పూసలగారితో సాన్నిహిత్యం ఏర్పడిరది. వృత్తిరీత్యా ఏర్పడిన పరిచయం వ్యక్తిగత స్నేహంగా మారింది. నా నవల ‘తెల్లగులాబి’ సినిమాగా రావలసిన సమయంలోనూ మేము ముగ్గురం కలిసే వారం. తదుపరి సినీరైటర్స్ అసోసియేషన్ సమావేశాలలో పూసలగారు సినీ కార్మికులకు ‘ఇ.ఎస్.ఐ, పిఎఫ్’ తదితర వసతులు కల్పించడానికి నడుం బిగించారు. స్వీయ దర్శకత్వంలో ఏడుపదుల వయసులో, తొలిసారిగా ‘‘డాలరుకి మరోవైపు’’ ప్రారంభించేముందు ఆ ప్రాజెక్టు గురించి చర్చించారు. ఈ వయసులో అవసరమా? అంటే,
‘‘కుర్రవాళ్ళతో కలిసి పనిచేస్తే మనమూ కుర్రవాళ్ళం అయిపోతాం..’’ అంటూ నవ్వేశారు. రాజకీయాలు తెలియని మనిషి, స్నేహానికి విలువ ఇచ్చే సగటు మనిషి తన సినిమాని థియేటరులో చూసుకోకుండా తొందరపడి వెళ్ళిపోయాడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను.
-తోటకూర రఘు