తెలుగు సినీ పరిశ్రమ కొత్తగా ఇండస్ట్రీ కి వచ్చిన వారిని ఆదరించడంలో పెద్ద పీటలు వేస్తుంది. 2005 లో ఇండస్ట్రీ కి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచయమై రైటర్ గా బాస్, శౌర్యం, కందిరీగ, మసాలా, ఆగడు వంటి సినిమాలకి పనిచేసి ఇప్పుడు డైరెక్టర్ గా తనకంటూ మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'పటాస్' అనే సినిమాకి దర్శకత్వం వహించి తన టాలెంట్ ను పరీక్షించుకోవడానికి ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనిల్ రావిపూడితో సినీజోష్ ఇంటర్వ్యూ...
- దర్శకుడిగా మొదటి సినిమా ఎలా చేసారని అనుకుంటున్నారు?
నేను రైటర్ గా చాలా సినిమాలకి పని చేసాను. కందిరీగ సినిమా చేస్తున్నపుడు 'పటాస్' కథ ను సిద్ధం చేసుకున్నాను. అప్పటి నుంచి చాలా మంది హీరోలను సంప్రదించాను. కాని కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ అనిపించి ఆయనని సంప్రదించగా కథ నచ్చి ఓకే చెప్పారు. ఇది నాకు మొదటి సినిమా అయినా ఎడిటింగ్ లో రైటర్ గా పనిచేసిన ఎక్స్ పీరియన్స్ బాగా ఉపయోగపడింది. ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా తీసాము. సినిమా రిలీజ్ అయ్యాకా డైరెక్టర్ గా సక్సెస్ అయ్యానో.. లేదో.. తెలుస్తుంది.
- 'పటాస్' ఎలా ఉండబోతోంది?
ఒక లంచగొండి పోలీస్ సిన్సియర్ గా ఎలా మారాడు. ఎలాంటి పరిస్థితుల వల్ల లంచగొండిగా మారాల్సి వచ్చింది. ఇలాంటి స్టొరీ ని ఒక కామిక్ వే లో తీసాము. మొదటి సారి కళ్యాణ్ రామ్ తో ఎక్కువ స్థాయిలో కామెడి చేయించడం జరిగింది. ట్రైలర్ చూసిన తరువాత ఈ సినిమా మీద పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమా ని ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాము.
- పాటలు ఏమైనా రిమేక్ చేయడం జరిగిందా?
బాలకృష్ణ గారు నటించిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో ఒక పాటను రిమేక్ చేసాము. అందులో ప్రతి పాటా చాలా అధ్బుతంగా ఉంటాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ పాటను ఎవరు రిమేక్ చేయడం జరగలేదు. అందుకే ఈ సినిమా లో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా నుంచి ఒక పాటను సెలెక్ట్ చేసుకొని రిమేక్ చేసాము.
- మొదటి సినిమానే యాక్షన్ జోనర్ లో చేయడానికి కారణం ఏమైనా ఉందా?
ఎన్టీఆర్ నటించిన 'ఆది' సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. మొదటి సారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చినపుడు ఒక కమర్షియల్ మాస్ సినిమాతో రావాలని ఈ కాన్సెప్ట్ రెడీ చేసాను. సాయికుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ మంచి పాత్రలు చేసారు.