Advertisement
Google Ads BL

తెలుగు సినిమాకి నాయకుడు కావాలి!


2014 సినిమా పరిశ్రమ ఇచ్చిన సందేశం!!
సినీ వినీలాకాశంలో సగం అయిన చిరంజీవి కుటుంబంలేని తెలుగు సినిమా పరిశ్రమని ఊహించలేం. తెలంగాణా-ఆంద్ర : రెండు రాష్ట్రాలలో సినీ పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధిలో చిరంజీవిని భాగస్వామి చేయగల వారెవరు? ప్రాభవం కోల్పోతున్న జయలలిత - కరుణానిధితో తమిళ నాయకత్వం సినిమా వారసత్వానికి స్వస్తి పలుకుతుందా? కింకర్తవ్యం? కేరళ రాజకీయం సినీ పరిశ్రమకి వరమాల వేయడం ఖాయం అనిపిస్తోంది.
2014 సంవత్సరానికి సోనియా, జయలలిత, రజనీకాంత్, దాసరి, ధోని, మహేష్ బాబు, ఎన్టీఆర్ వీడ్కోలు పలికిన తీరుకీ -
            మోదీ, బాలకృష్ణ, బన్నీ, నాగర్జున, సంపూర్నేష్ బాబు, విరాట్ కోహ్లి మరియు రామ్ చరణ్, వెంకటేష్, గోపిచంద్, నిఖిల్, శర్వానంద్, సాయిధర్మతేజ, 2014 కి వీడ్కోలు పలికిన తీరుకీ తేడా వుంది!
            - అందుకే అన్నారు ఆత్రేయ 'నవ్వినా ఏడ్చినా వచ్చేది కన్నీళ్ళే' అని!
            సినిమాల జయాపజయాలు బాక్సాఫీసుని బ్యాలెన్సు చేసినా, దక్షిణ భారత సినిమా పరిశ్రమలో 'లెజెండ్స్' అనదగిన 'బా'త్రయం  - బాలు మహేంద్ర, బాపు, బాలచందర్; పార్వతినివెదుక్కుంటూ వెళ్ళిన వెండితెర దేవదాసు 'అక్కినేని' మరియు ఎందరో నటీనట సాంకేతిక వర్గం శాశ్వతంగా దూరమయ్యారు.
           మేధోపరంగా 2014 దక్షిణ భారత సినిమాకి పెనువిషాదాన్నే మిగిల్చింది; పూడ్చుకోలేని నష్టాన్ని నెత్తిన పెట్టిపోయింది.
      స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబానికి ఎక్కువ మోతాదులో ఖేదాన్ని, తక్కువ మోతాదులో మోదాన్ని మిగిల్చింది. హరికృష్ణ కుమారుడు జానకీరాం అకాలమరణం, ఎన్టీఆర్ ఖాతాలో హిట్స్ లేకపోవడం ఖేదానికి కారణాలు. బాలకృష్ణ 'లెజండ్'  సూపర్ హిట్ కావడం; ఎమ్మెల్యేగా కూడా హిందూపూర్ నుంచి ఎన్నిక కావడం ఆనందదాయకం. అదే సమయంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం, కేంద్రమంత్రిగా చక్రంతిప్పిన పురంధేశ్వరి పార్టీ మారినా పరాజితగా మిగిలిపోవడం గమనార్హం. 
           - ఇవికావు పరిశ్రమ ముందున్న పెద్ద సవాళ్లు.
            దక్షిణ భారత సినిమాకి జాతీయ మార్కెట్ - అంతర్జాతీయ మార్కెట్ సంపాదిస్తున్న రజనీకాంత్, కమలహాసన్, మహేష్ బాబు దూకుడుకి 2014 బ్రేక్ వేసింది. దక్షిణ భారత సినిమాకి కేంద్రం - చెన్నై. తమిళనాడు ఏలికలు సినిమావారే! కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి ముగింపు పలకబోతోందా? కరుణానిధి, జయలలిత, శరత్ కుమార్, విజయకాంత్ వంటి హేమాహేమీలు గత చరిత్రేనా? 'లేడీ అమితాబ్' అనిపించుకున్న విజయశాంతిని తెలుగు ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయినట్లే! 
ఆంధ్ర - తెలంగాణ - తమిళనాడు - కేరళ రాష్ట్రాలలో పరిస్థితులు సినీ పరిశ్రమ మనుగడనే ప్రస్నించేలా వున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్దికి కొన్ని స్వీయ నియమ నిబంధనలు రూపొందించుకున్నాం. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది. 'సినీ' పరిశ్రమ ఎక్కడ వుంటే అక్కడ 'టివి' పరిశ్రమ తొందరగా వృద్ధి చెందుతుంది; కళలు - కళాకారులతో కళకళలాడుతుంది. తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణలోనే - హైదరాబాద్ లోనే ఉండేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో
అదే సందర్భంలో తెలుగు సినీ పరిశ్రమ ఎన్టీఆర్ కుటుంబంతో - తెలుగుదేశం పార్టీతో చంద్రబాబుతో మమేకమయివుంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తారనడం నిర్వివాదాంశం. కానీ చిరంజీవి ఫ్యామ్లీ లేని తెలుగు సినీ పరిశ్రమని ఊహించలేం; తెలుగు సినీ వినీలాకాశంలో సగం చిరంజీవి కుటుంబం. కానీ కాంగ్రెసు నాయకుడయిన చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్దిలో భాగస్వామిని చేయవలసిన అవసరం ఎంతైనా వుంది. అవసర సమయంలో కేంద్ర మాజీ మంత్రి దాసరి 'ఎర్రబస్సు' పంక్చరవ్వడం దురదృష్టం. తెలుగు సినీ పరిశ్రమ దశ - దిశ నిర్దేశించే దాసరి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, పద్మాలయా ఆదిశేషగిరిరావు, శ్యాంప్రసాద్ రెడ్డి, రాఘవేంద్రరావు , నాగార్జున తదితరులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి కూర్చోబెట్టగల చొరవ వున్నవారు ముగ్గురే ముగ్గురు : కె.ఎల్. నారాయణ - టి. సుబ్బిరామిరెడ్డి మరియు తెలుగు సినిమా హీరో, రాజమండ్రి టిడీపి ఎంపీ, రియల్టర్ మురళీమోహన్. ఈ ముగ్గురిలో సుబ్బిరామిరెడ్డి సినీ ప్రముఖుడిగా కన్నా కాంగ్రెసు నాయకునిగా ముద్రపడ్డారు. కనుక సంధానకర్తగా ఈ ముగ్గురిలో ఒకరు చిరంజీవిని, దాసరిని, రాఘవేంద్రరావుని, అల్లు అరవింద్ ని, దిల్ రాజుని, సురేష్ బాబుని కలిపి కుర్చోబెట్టగలరు. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ - సినిమా పరిశ్రమ వ్యవహారం కాదు. తెలంగాణ సినిమా పరిశ్రమ వ్యవహారం కూడా! తెలంగాణ ముఖ్యమంత్రిని, తెలంగాణ సినీ అనుబంధ శాఖల్ని నొప్పించకుండా ఒప్పించగల సామర్ధ్యం ఉన్న వ్యక్తి ద్దసరి. వీరందర్నీ ముందుగా ఒక చోట కుర్చోబెట్టగల సూత్రధారి అవసరం ఎంతైనా ఉంది. ఆ సారధి ఎవరు? ఆంధ్రలో - తెలంగాణ లో సినిమా పరిశ్రమ సంక్షేమానికి చేయవలసిన సూచనలేమిటి? అన్న విషయమై వ్యక్తి గత ప్రయోజనాలను పక్కన పెట్టి పరిశ్రమ మనుగడకు ఆలోచన చేసే వ్యక్తులు కావాలి. హైదరాబాదుకి చిత్ర పరిశ్రమని తరలించాలన్నది అక్కినేని ఆకాంక్ష; అదే సమయంలో ఎమ్మెస్ రెడ్డి కృషిని తక్కువ చేయలేం; కాసు బ్రహ్మానందరెడ్డి - చెన్నారెడ్డి - ఎన్టీఆర్ అందించిన సహకారాన్ని విస్మరించలేం. 
           ఆంధ్ర - తెలంగాణలోనే కాదు తమిళనాడులోను పరిస్థితులు చకాచకా మారిపోతున్నాయి.  పరిశ్రమ బాగోగులు తెలిసిన వారే కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు ఏలికలు. రేపటి రోజున ఆ ఆధిపత్యం కొనసాగుతుందా? అన్నది మిలియన్ డాలరు ప్రశ్న. సరిగ్గా ఇదే సమయంలో కేరళ లో అధికారాన్ని చేజిక్కించుకునే మహదవకాసం మలయాళీ సినిమా పరిశ్రమ తలుపు తడుతోంది. 
సినీ పరిశ్రమవృద్దికి వరాల జల్లు కురిపించారు తెలంగాణ 
ముఖ్యమంత్రి కెసిఆర్. కానీ చిన్న సినిమా బతికి బట్టకట్టడానికి
నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి. 'థియేటర్లు - వినోదపు 
పన్ను' వంటి సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టేలా చేయగల 
సమర్ధ సినీ నాయకత్వ అవసరం.
ప్రణాళికా బద్ధంగా అంతర్జాతీయ పెద్ద పెద్ద పట్టణాలకు 
ధీటుగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం - కొత్త రాజధాని :
సినిమా థియేటర్లు , పరిశ్రమ మౌళిక సదుపాయాలకు స్థానం 
కల్పించేలా ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగల సినీ నాయకుని 
అవసరం వుంది.
ముక్తాయింపు: దక్షిణాది రాష్ట్రాలలోని సినిమా పరిశ్రమ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది.సినిమా పరిశ్రమ మనుగడకి భావి తరాల గురించి ఆలోచించే నాయకులు రావలసిన అవసరాన్ని 2014 మన ముందుంచి వెళ్ళిపోయింది. ఆ నాయకుడ్ని ఎంపిక చేసి మనముందుకు తీసుకొచ్చే బాధ్యతని చేపట్టిన 2015ని స్వాగాతిద్దాం.
                                                                                                                              -తోటకూర రఘు 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs