అవును.. జనసేన అధినేత, మాజీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు, ఆ తర్వాత ఎన్నెన్ని కామెంట్లు చేసి ఉంటారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్యాకేజీ స్టార్, దత్త పుత్రుడు, నాలుగు పెళ్లిళ్లు.. ఇంతకుమించి కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ ఇలా దారుణాతి దారుణంగా పవన్‌ను విపక్షనేత జగన్ అనరాని మాటలు అన్నారు. మరోవైపు పవన్ కూడా వైసీపీని, జగన్‌ను అధః పాతాళానికి తొక్కేస్తా గుర్తు పెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చి మరీ వార్ చేశారు. అయితే నేడు పవన్ కళ్యాణ్ బాధలో ఉంటే, రాజకీయాలు పక్కన పెట్టి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ వేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.
అసలేం జరిగింది?
మంగళవారం నాడు పవన్ కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం, ఫైర్ సిబ్బంది నిచ్చెన ద్వారా విద్యార్థులను కిందికి దింపింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక విద్యార్థి మరణించాడు. స్కూల్‌లో ఒక్కసారిగా పొగ అలుముకోవడంతో ఊపిరాడక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అనేకమంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. చేతులు, కాళ్లు, ముఖం భాగాలు తీవ్రంగా కాలాయి. ప్రమాదంలో మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో మార్క్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం స్కూల్‌కు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శంకర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగాస్టార్ చిరంజీవితో సహా పవన్ అత్యంత సన్నిహితులు ప్రకటించారు.
జగన్ ఆవేదన..
పవన్ కుమారుడికి ఇలా జరిగిందని తెలుసుకున్న వైఎస్ జగన్ చలించిపోయారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసి షాకయ్యాను. ఈ క్లిష్టపరిస్థితుల్లో పవన్, ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మార్క్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి తిరిగిరావాలని మనసారా కోరుకుంటున్నానని మాజీ సీఎం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కాగా, ప్రమాదం గురించి తెలిసి సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, బండి సంజయ్.. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇంకా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ట్వీట్లు చేయడం కామన్. ఎందుకంటే వారంతా ఆయనకు రాజకీయంగా, పార్టీ పరంగా మిత్రులు. కానీ ఎప్పుడూ బద్ధశత్రువుల్లా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ.. పచ్చ గడ్డేస్తే భగ్గుమనే పరిస్థితుల నడుమ పవన్ బాధలో ఉన్నారని జగన్ ఇలా మానవత్వం చూపుతూ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
దారిలోకి వస్తున్న జగన్!
వాస్తవానికి పవన్ పేరు నోటితో పలకడానికి కూడా వైఎస్ జగన్ సాహసించరు. ఎన్నికల ముందు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన తీరు అంతే. పవన్ పార్టీ పెట్టినప్పట్నుంచీ ఒకట్రెండు సందర్భాల్లో మాత్రమే పవన్ పేరు, గారు అని ప్రస్తావించి ఉండొచ్చు అంతే. ఎంతసేపూ ప్యాకేజీ, ప్యాకేజీ స్టార్, మూడు పెళ్లిళ్లు, సనాతన ధర్మ పరిరక్షకుడు ఇలా చిత్ర విచిత్రాలుగా విమర్శలు గుప్పించేవారు. అలాంటిది ఇవాళ పవన్ గారు అని సంబోంధించడం గమనార్హం. నిజంగా ఈ ట్వీట్ చూసిన జనసైనికులు, మెగాభిమానులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సైతం ఒకింత ఫీలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ట్వీట్ చేయడం గ్రేట్, ఎంత శత్రువైనప్పటికీ మానవత్వంతో వ్యవహరించారని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఇన్నాళ్లు అటు పవన్.. ఇటు జగన్ ఏదేదో విమర్శలు చేసుకున్నారు. అంతకుమించే తిట్టుకున్నారు కానీ ఇప్పుడిప్పుడే జగన్ అన్నీ తెలుసుకుని దారిలోకి వస్తున్నారని జనసైనికులు, వైసీపీలోనే చర్చించుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక జగన్ స్పందన చూసి జనసేన శ్రేణులు సైతం నిజంగా జగన్ గ్రేట్ కదా అని సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ ట్వీట్ చూసి సాయంత్రం లేదా రేపటి రోజున జగన్‌కు పవన్ థ్యాంక్స్ చెప్పినా చెప్పొచ్చు. అదే జరిగితే వైసీపీ శ్రేణులు, జనసేన శ్రేణులకు యమా కిక్కిచ్చే విషయమే.