Advertisement

బాబోయ్.. ఏపీలో ఏమిటీ అగ్గిపెట్టెల గోల..!!


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న, కనిపిస్తున్న ఒకే ఒక్క మాట అగ్గిపెట్టెలు.. అగ్గిపెట్టెలు. వామ్మో అన్ని అగ్గిపెట్టెలు ఏం చేసినట్టు..? 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి..? అని రచ్చ రచ్చే జరుగుతోంది. ఇంతకీ ఏమిటీ గోల అనే సందేహాలు వస్తోంది కదా..! అదేనండోయ్.. బెజవాడ వరద బాధితులకు ప్రభుత్వం పెట్టిన ఖర్చుల్లో ఒక భాగమే ఇది. సర్కార్ ఒక రకంగా చెబుతుంటే ప్రత్యర్థులు, నెటిజన్లు, వైసీపీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, అంతకు మించి ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఇంతకీ ప్రభుత్వం ఏం చెబుతోంది..? సామాన్యుడు మొదలుకుని నెటిజన్ల వరకూ వస్తున్న సందేహాలు ఏంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందామా ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి..

Advertisement

అసలేం జరిగింది..?

విజయవాడ వరద సహాయం పేరుతో కూటమి ప్రభుత్వం భారీ దోపిడీ చేసిందన్నది సోషల్ మీడియాలో నెటిజన్లు, వైసీపీ చేస్తున్న ఆరోపణ. కేవలం ఫుడ్ సప్లయ్ కోసం 323 కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. మొత్తం ఫుడ్ పాకెట్స్ 1,14,48,410 కాగా.. ఇందులో ఇస్కాన్ ధర ఒక్కో ఫుడ్ పాకెట్ 30 రూపాయలు అనుకున్నా.. మొత్తం ఫుడ్ ప్యాకెట్లకు అయ్యే ఖర్చు 34 కోట్ల రూపాయలు మాత్రమే. ఐతే.. ప్రభుత్వం మాత్రం 368 కోట్లు కోట్లు చూపినట్లు.. ఇందులో 334 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందన్నది వైసీపీ నేతలు కొందరు చేస్తున్న పెద్ద ఆరోపణ. ఇవన్నీ ఒక ఎత్తయితే.. 23 కోట్ల రూపాయలు అగ్గి పెట్టెలకు ఖర్చు పెట్టడం ఏంటి..? అన్నది మరో ఆరోపణ. ఈ విషయంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూనే ఉన్నాయ్. ఇదే అదునుగా చేసుకున్న వైసీపీ ఒక రేంజిలో ఈ అగ్గిపెట్టెల వ్యవహారాన్ని వైరల్ చేస్తోంది.

ప్రభుత్వం ఏం చెబుతోంది..?

ఐతే.. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల‌కు రూ. 23 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని సామాజిక మాధ్యమాల్లో కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని చేస్తున్న అస‌త్య ప్ర‌చారాల‌ను ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారాన్ని రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్పీ సిసోడియా పూర్తిగా ఖండిస్తూ వివరణ ఇచ్చారు. అవ‌న్నీ ఫేక్ ప్ర‌చారాల‌ని కొంత‌మంది ప్ర‌భుత్వంపై బుర‌ద చ‌ల్ల‌డం కోసం, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించడం కోసం ఇలాంటి అస‌త్య ప్ర‌చారాల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని వివ‌రించారు. వ‌ర‌ద‌ల కార‌ణంలో వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో విద్యుత్తు స‌ర‌ఫ‌రా లేక రాత్రిళ్లు ప్ర‌జ‌లు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డార‌ని, వారికి రాత్రిళ్లు ఇబ్బందులు త‌లెత్త‌కుండా మొబైల్ జ‌న‌రేట‌ర్లు త‌రలించి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని స్పష్టం చేశారు. కేవ‌లం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీకి 23 కోట్లు వెచ్చించామ‌న‌డం పూర్తిగా నిరాధార‌మైనదని సర్కార్ చెబుతోంది.

ఇదేం లెక్క సారూ..!

ఒకొక్క ఇంటికి 5 కొవ్వొత్తులను ప్రభుత్వం ఇచ్చింది అనుకుంటే.. ఒకొక్కటి 25 రూపాయలు అనుకున్నా.. ఒకొక్క ఇంటికి 2 హోం లైట్స్ లాంటివి 10 రూపాయలు అయినా మొత్తం 2 కోట్ల రూపాయలు మించి అవ్వదని కొందరు లెక్కలేసి మరీ చెబుతున్నారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు 23 కోట్లు ఎలా ఖర్చు చేశారనే విమర్శలు రావడంతో.. దీనికి జనరేటర్లను కూడా అదనంగా అప్పటికప్పుడు ఖర్చులో జత చేసి కొత్తగా ఖర్చుల పట్టి రిలీజ్ చేయడం గమనార్హం. పోనీ.. జనరేటర్లు కూడా ఖర్చు పెట్టారనుకుంటే.. ఎక్కడెక్కడ జనరేటర్లు వాడారో ప్రభుత్వం చెప్పడం లేదు ఎందుకు..?. ఇక వీధిలైట్లకు వరద తగ్గాక రెండు రోజులు మాత్రమే పెట్టారు.. అది కూడా ప్రధానమైన కూడళ్లలో మాత్రమే.. మీరు ఏ ఇంటికి జనరేటర్లు ద్వారా విద్యుత్ ఇవ్వలేదని కొందరు వరద బాధితులు సోషల్ మీడియాలో రాసుకోస్తున్నారు.

అద్దె ఎంత ఉండొచ్చు..?

పోనీ.. ఒక్కో జనరేటర్ కు ఒక రోజుకి అద్దె ఎంత ఉంటుంది..? మహా అయితే 50 వేలు, పోనీ లక్ష అనుకుందాం.. ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని జనరేటర్లు పెట్టి  ఉంటారు..? ఒక వంద పెట్టారా.. పోనీ 200 పెట్టారా.. పోనీ 300 పెట్టారా..? ఎలా వేసుకున్నా 3 కోట్ల రూపాయలు దాటదు కదా సార్?.. మరి మిగతా 20 కోట్లు అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు వాడినట్లేగా..? అని కొందరు నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఐతే.. ఇలాంటి విమర్శలు గుప్పిస్తే ఆలస్యం నిమిషాల్లోనే ఏపీ పోలీసులు, ఫ్యాక్ట్ చెక్ ఏపీ అనే ట్విట్టర్ అకౌంట్ల నుంచి రిప్లై రావడం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం గమనార్హం. ఐనా.. భావప్రకటనా స్వేచ్ఛ అనేది పౌరులకు రాజ్యాంగం అనేది మరిచిపోతే ఎలా..? అధికారం చేతిలో ఉందని స్వేచ్ఛకు భంగం కలిగిస్తే న్యాయస్థానాలు చూస్తూ కూర్చోవు కదా..? అని నెటిజన్లు ధీమాగా చెప్పుంటున్న పరిస్థితి. ఇవన్నీ కాదు.. వరద పునరావాస ఖర్చును ఎవరెవరికి ఎంతెంత చెల్లించారో పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచి నిజాయితీని నిరూపించుకుంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాట్లాడేందుకు ఛాన్స్ ఉండదు కదా..?

కలక్టరేట్ చుట్టూ బాధితులు!

ఇందులో నిజానిజాలు ఎంత..?. దుష్ప్రచారమేనా..? నిజమా..? అసలు నిజం ఏమిటో ప్రభుత్వం.. ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు.. వరద సాయం అందలేదని కలక్టరేట్ చుట్టూ బాధితులు ఎందుకు తిరుగుతున్నారు..? అనే ప్రశ్నకు ఇప్పటి వరకూ ఎవరూ సమాధానం చెప్పడం లేదు. దీంతో.. సంక్షోభంలో ఏ అవకాశం వచ్చినా దోపిడీ చేసుకోవడానికి కూటమి సర్కార్ వెనుకాడలేదని వైసీపీ తిట్టిపోస్తున్న పరిస్థితి. చూశారుగా.. ప్రభుత్వం ఒకసారి స్పష్టత ఇచ్చినా అగ్గిపెట్టెల గోల ఆగట్లేదు.. దీనికి తోడు లెక్కలేసి మరీ ఇదిగో ఇంత అవుతుందని కొందరు బాధితులు, వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి చెబుతుండటం గమనార్హం. ఇప్పటికైనా ఈ గోలకు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెడితే మంచిది.. అవసరమైతే ఆధారాలు లేకుండా, కావాలని తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇంకా మంచిదేమో మరి.

 

What is the noise of matches in AP?:

  In the AP politics matches are the only word heard everywhere on social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement