టైటిల్ చూడగానే ఇదేంటి అనుకుంటున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. ఏపీలో ఎన్నికలు మాత్రమే అయ్యాయి. ఫలితాలు రాకముందే పిఠాపురంలో రచ్చ రచ్చగా ఉందని తెలియవచ్చింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కచ్చితంగా గెలుస్తారని.. మెజార్టీ ఎంతనేది మాత్రమే తెలియాలని ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో పవన్ గెలిస్తే నా పరిస్థితేంటని టీడీపీ నేత వర్మ.. అవును నా పరిస్థితేంటని మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుకుంటున్నారట. అటు కూటమి.. ఇటు పవన్ గెలిస్తే కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇక్కడి వరకూ అంతా ఓకే.. వాట్ నెక్స్ట్ అన్నదే అటు టీడీపీ.. ఇటు జనసేన శ్రేణుల్లో మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న.
నేనే.. అవును నేనే!
ఆలూ.. లేదు చూలూ అనే సామెత గుర్తుంది కదా.. ఒకటి కాలేదు.. ఒకటి పోలేదు కానీ పిఠాపురంలో మాత్రం రచ్చ మొదలైంది.! అప్పుడే పిఠాపురంలో ఇప్పుడు సరికొత్త రాజకీయానికి నాగబాబు, వర్మ తెరలేపినట్లు.. ఇద్దరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరినట్లు తెలియవచ్చింది. పిఠాపురంలో పవన్ గెలిస్తే.. నేనే నంబర్-02, ఎందుకంటే నా సీటు త్యాగం చేసి మరీ సేనానీకి ఇచ్చానన్నది వర్మ సైడ్ నుంచి వస్తున్న మాటలట. ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గాన్ని చూసుకోవడానికి.. పిఠాపురంలో పవన్ తర్వాత నంబర్-02 తానేనని వర్మ చెప్పుకుంటున్నారట. మరోవైపు.. వర్మ వీరాభిమానులు, కార్యకర్తలు కూడా అసలే సీటు పోగొట్టుకుని ఈ పరిస్థితికి తెచ్చుకున్నారని.. ఇక నియోజకవర్గం బాధ్యతలు, అభివృద్ధి విషయంలో అన్నీ మీరే ఉండాలని గట్టిగా పట్టుబడుతున్నారట.
అసలు నువ్వెవరు..!
ఇవన్నీ కాదు జనసేనలో అయినా.. పిఠాపురంలో అయినా నంబర్-02 నేనే అని మెగా బ్రదర్ నాగబాబు గట్టిగానే చెప్పుకుంటున్నారట. నియోజకవర్గ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టడంతో పాటు సమస్యలను పరిష్కరించే పనులన్నీ తానే తీసుకుంటానని ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని జనసేన శ్రేణులకు నాగబాబు చెప్పారట. పైగా.. పిఠాపురం అంటే మరో హైదరాబాద్ అనేలా అభివృద్ధి చేస్తానని అప్పట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు మాటిచ్చిన విషయం తెలిసిందే. అందుకే హైదరాబాద్ రేంజ్‌లో అభివృద్ధి చేయడానికి అన్నీ తానై చూసుకుంటానని నాగబాబు చెప్పుకుంటున్నారట. త్యాగం చేసింది.. పవన్ గెలుపుకోసం అహర్నిశలు కృషి చేసింది తానని అసలు పిఠాపురంకు వచ్చి హడావుడి చేయడానికి నువ్వెవరు అంటే నువ్వెవరు అని ఇద్దరి వాదోపవాదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత ఉందో తెలియట్లేదు కానీ.. ఇప్పుడు నెట్టింట్లో ఇదే రచ్చ నడుస్తోంది.