ఒకే ఒక్కరోజు.. అది కూడా పోలింగ్‌కు ముందు రోజు.. వాస్తవానికి గెలుపోటములను, ఓటరు మైండ్ సెట్‌ను మార్చేది ఒక్కరోజే.! అలాంటిది వైసీపీకి సువర్ణావకాశమే వచ్చేసింది. గత కొద్దిరోజులుగా ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల విడుదలపై ఎంత రాద్ధాంతం జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆరు నెలల ముందు నుంచి వైసీపీ ఆడిన హైడ్రామా.. దీనికి తోడు టీడీపీ రంగంలోకి దిగి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సీన్ కట్ చేస్తే రెండు పార్టీలు కలిసి లబ్ధిదారులు, నిరుపేదల పొట్ట కొట్టారనే ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. అయితే.. మొత్తం టీడీపీనే చేసిందని జనాల్లోకి గట్టిగా తీసుకెళ్లిన వైసీపీకి ఎంతో కలిసొచ్చింది. ఎందుకంటే ఈ మధ్యనే పెన్షన్లు విషయంలో టీడీపీపై ఎంత వ్యతిరేకత వచ్చిందో ముసలీ ముతక, వికలాంగులు, వితంతవుల మాటలు వింటే అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు.. ఇన్‌పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం నిధుల విడుదల చేయాలని జగన్ సర్కార్ భావిస్తే.. ఇదెలా సాధ్యమంటూ టీడీపీ కోర్టుకెక్కింది.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఇలా హడావుడి చేసి ఆఖరికి వైసీపీకి గోల్డెన్ ఛాన్స్ తెచ్చిపెట్టింది.
ఒకే ఒక్కరోజే..!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్‌పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలకు ప్రతి ఏడాదీ నిధులు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం బాగా ఆలస్యమైంది. ఎన్నికలు రావడం.. ఈసీ బ్రేకులు వేయడం.. కోర్టు మొట్టికాయలు వేయడంతో మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి. అయితే.. అదే హైకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించగా.. ఒకింత శుభవార్తే వచ్చింది. నిధుల విడుదలపై గతంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన స్టేను ఈ నెల 10 వరకూ తాత్కాలికంగా పక్కనపెట్టింది. దీంతో.. శుక్రవారం అర్ధరాత్రి వరకూ నిధుల పంపిణీకి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజంగా వైసీపీకి, వైఎస్ జగన్ రెడ్డికి ఇదొక సువర్ణావకాశమే. అయితే, నిధుల పంపిణీని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని, ఈసీ ప్రవర్తన నియమావళికి లోబడి నిధుల పంపిణీ ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకూ లబ్ధిదారులకు విడుదల చేయొద్దని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా.. మే-13న పోలింగ్ ముగిసే వరకూ సంక్షేమ పథకాల నిధుల సొమ్ము రూ.14,165 కోట్ల పంపిణీని నిలిపివేస్తూ ఈసీ.. ఈ నెల 9న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం నాడు వైసీపీకి శుభవార్త వచ్చింది.
ఫ్యాన్ పార్టీకి కలిసొచ్చేనా..!
రూ.14,165 కోట్ల నిధుల పంపిణీ ఒక్కరోజులోనే రిలీజ్ చేయడం అంటే కచ్చితంగా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుంది. అలాంటిది ఒక్కరోజులో ఎంత మంది లబ్ధిదారులకు ప్రభుత్వం జమ చేయగలదు అన్నది ఇప్పుడు జగన్ ముందు ఉన్న పెను సవాల్. ఎందుకంటే ఒకరికి వచ్చి ఇంకొకరికి రాకుంటే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో.. వాళ్లంతా ప్రభుత్వంపై ఎంతలా దుమ్మెత్తి పోస్తారో.. అదంతా వైసీపీకి ఎంత మైనస్ అవుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వైసీపీ పోరాటం లభించింది సరే.. ఇవాళ అర్ధరాత్రి వరకూ జమ చేయడమనేదే పెద్ద సవాల్. ఇదొక్కటి గట్టెక్కితే వైసీపీ ఊపిరిపీల్చుకోవచ్చు.. లబ్ధిదారులూ హ్యాపీగా ఫీలవ్వొచ్చు మరి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఏం చేశామన్నది ఇప్పుడు అనవసరం ఆఖరి నిమిషంలో ఏం చేశామన్నది మాత్రమే ఇప్పుడు లబ్ధిదారులూ.. ఓటర్లకు గుర్తుండేది గనుక.. ఒకరకంగా చెప్పాలంటే హైకోర్టు తీసుకున్న ఈ ఒక్కరోజు నిర్ణయం వైసీపీకి బాగా కలిసొచ్చేదేనని రాజకీయ విశ్లేషకులు, మేథావులు చెబుతున్న మాట. ఏం జరుగుతుందో చూడాలి మరి.