విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. ఓ కంటైనర్‌లో 25 వేల కిలోల డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా వచ్చిన ఓ సరకు రవాణా కంటైనర్ లో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడింది. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16న కంటైనర్ విశాఖకు వచ్చినట్లు వివరించారు. బ్రెజిల్ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు ఈ కంటైనర్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ గరుడ పేరుతో డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కంటైనర్ భారత్ చేరుకున్న నేపథ్యంలో, ఇంటర్ పోల్ నుంచి ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి సమాచారం అందింది. వెంటనే ఢిల్లీ సీబీఐ కార్యాలయం విశాఖ సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. ఈ నెల 19న నార్కొటిక్స్ అధికారులతో వచ్చి కంటైనర్ ను పరీక్షించిన సీబీఐ... అందులో ఉన్నది నిషిద్ధ మాదకద్రవ్యాలు అని నిర్ధారించుకుంది. 25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగులు ఉన్నట్టు గుర్తించారు.
అయితే విశాఖ తీరంలో దొరికిన 25 వేల కేజీల డ్రగ్స్‌తో టీడీపీ నేతలకు లింక్ లు ఉన్నట్లుగా వైస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ డ్రగ్స్ స్కాంలో టీడీపీ నేతలకు నేరుగా లింకులు ఉన్నాయంటూ, టీడీపీ నేతలు దామచర్ల సత్య, లావు శ్రీ కృష్ణ దేవరాయలు & రాయపాటి జీవన్ లతో నిందితుడు కోటయ్య చౌదరి కి దగ్గర సంబంధాలు ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా సంబంధిత వ్యక్తులతో చంద్రబాబుకి సంబంధాలు ఉండడంతో ఆ కోణంలోను అధికారులు విచారించాలనంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ తో లింక్ లు ఉండబట్టే చంద్రబాబు, లోకేష్ లు ఉలిక్కిపడి ముందుగానే ట్వీట్లు వేస్తూ జగన్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారని, ఇందులో వైసీపీ కి ఎలాంటి సంబంధం లేదు అని వారు చెబుతున్నారు.